జిఎస్టి విషయంలో తెలంగాణ ప్రభుత్వం లెక్క తప్పు అని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బహిరంగంగా విమర్శించారు. కాని సరైందేనని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ చెప్పలేకపోవడం విచిత్రంగా వుంది. నోట్లరద్దు, జిఎస్టి విషయంలో మొదటి నుంచి కెసిఆర్ ప్రభుత్వ తీరుతెన్నలు కాస్త వింతగానే వున్నాయి. వీటివల్ల తమకు నష్టం అని మొదట ప్రకటించారు. తర్వాత లాభమేనన్నారు. మళ్లీ నష్టం అన్నారు. నోట్లరద్దు విషయంలో బిజెపి నేతల కన్నా ముందే అభినందించడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పరుగెత్తారు.ఇక జిఎస్టికి అసెంబ్లీ ఆమోదముద్ర వేయించడంలోనూ అందరికన్నాముందే హడావుడి పడ్డారు. దానివల్ల తమకు తొమ్మిది వేల కోట్లు నష్టం అని మొదట్లో రాజేందర్ చెప్పారు.కాని తర్వాత అధికారులతో సమావేశంలో కెసిఆర్ అందుకు భిన్నంగా అదనపు ఆదాయం వస్తుందన్నారు. మంత్రి కెటిఆర్ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అదనపు భారం పడకుండా చేయడానికి కేంద్రం ప్రాథమికంగా అంగీకరించిందని చెప్పారు. తర్వాత అదేం జరగలేదు. ఒక దశలో కెసిఆర్ జిఎస్టి సమస్యపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. అన్ని వివరాలు ఇచ్చే అధికార వ్యవస్థ వున్న ప్రభుత్వాధినేతలు ఇన్ని రకాలుగా మాట్లాడ్డం నిజంగా హాస్యాస్పదమే. ఇక ఇప్పుడు ఏకంగా అరుణ్‌జైట్లీ తెలంగాణ ప్రభుత్వ లెక్క తప్పని వ్యాఖ్యానించారు. మరి రాష్ట్ర మంత్రి ఎందుకని ఆ మాటలు ఖండించలేకపోయారు? తమ దగ్గరున్న వివరాలు ఎందుకు వెంటనే బయిటపెట్టలేదు? తెలియదు. నిజానికి జిఎష్టి రాష్ట్రాల ఆదాయానికి గండి అన్నది అందరూ అంగీకరించిచిన విషయమే. కాని కావాలని మొదట్లో తప్పుగా మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొంత ఇరకాటంలో పడిపోయింది. ఆర్థిక మంత్రి రాజేందర్‌ను కూడా రాజకీయ వైరుధ్యాలతో చూస్తున్న అధినేత ధోరణికి ఇదీ ఒక ఉదాహరణ కావచ్చు, అవన్నీ ఎలా వున్నా ప్రజలకు మాత్రం గజిబిజి రాష్ట్రానికి ఆర్థికపోటు అనివార్యమవుతున్నాయి.