సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ బాగా పెరిగిపోయిందని జీఎస్టీ పెంచేసింది కేంద్రం. ఇప్పటి వరకూ పన్నెండు శాతం పన్ను ఉండేది ఇక నుంచి పద్దెనిమది శాతం వసూలు చేస్తారు. అంటే సెకండ్ హ్యాండ్ కార్ల రేట్లు కూడా బాగా పెరిగిపోతాయన్నమాట. అంతటితో వదిలి పెట్టలేదు. పాప్ కార్న్ ను రకరకాలుగా చేసి పనులు వేశారు. ప్లేవర్డ్ పాప్ కార్న్ తీసుకుంటే ఇరవై ఎనిమిదిశాతం జీఎస్టీని కట్టాల్సిందే.
ఆ మధ్య తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లినప్పుడు అక్కడి హోటల్స్ యజమానులు జీఎస్టీల తీరుపై విరుచుకపడ్డారు. బన్నుకు ఓ రేటు.. క్రీమ్ టన్నుకు ఓ రేటు ఉండటం లాంటి సమస్యలను ఏకరవు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హోటల్ యజమానిని పిలిపించుకుని క్షమాపణలు చెప్పించుకున్నారు. ఆ వీడియోను రిలీజ్ చేయించుకున్నారు. మరి ఇప్పుడేం చేశారు. పాప్ కార్న్లలోనూ రకరకాలు చేసి వాటిపై జీఎస్టీని వేసేస్తున్నారు.
ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మాత్రం చెప్పడంలేదు. ఆదాయం తగ్గిందా అంటే… ఎప్పటికప్పుడు రికార్డు స్థాయి ఆదాయం వస్తోంది. జీఎస్టీని ఆదాయాన్ని అభివృద్ధికి సూచికగా చెప్పుకుంటున్నారు. ఇలా పన్నులు పెంచుతూ పోతే అభివృద్ధి పెరుగుతుందా?. కొసమెరుపేమిటంటే.. లైఫ్ ఇన్సూరెన్స్లపైనా జీఎస్టీని ఏమిటని అందరూ మండిపడుతూంటే.. వాటిని తీసేస్తామని లీకులిచ్చి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. కానీ పాప్ కార్న్ మీద మాత్రం వేసేశారు.