గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జి ఎస్ టి) భారతీయ ఆర్ధిక వ్యవస్ధలో మౌలికమైన మార్పు, మెరుగుదలా వుండదా?
ఉండదనే అంటున్నారు ఆర్ధికవేత్తా, రాజ్యసభసభ్యుడూ, బిజెపిలో వున్నా కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించగల మేధావీ, ప్రొఫెసర్ సుబ్రమణ్యస్వామి.
జి ఎస్ టి చట్టమైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ (జిడిపి) ఒకేసారి 2 శాతం పెరుగుతుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతోంది.
రాజ్యసభలో మెజారిటీ లేని బిజెపి – కాంగ్రెస్ కలసి రాకపోవడం వల్ల ఈ ఏకీకృత పన్ను విధానమైన జి ఎస్ టి చట్టాన్ని తీసుకురాలేకపోయింది. రెండేళ్ళుగా ప్రతీ పార్లమెంటు సమావేశాల ముందూ బిల్లుపై సహకారం కోసం బిజెపి కాంగ్రెస్ ను సంప్రదిస్తూనే వుంది. కాంగ్రెస్ కాస్త మెత్తబడటం తో వచ్చే సమావేశాల్లోనైనా జి ఎస్ టి చట్టమౌతుందని కేంద్రప్రభుత్వం ఆశాభావంతో వుంది.
ఈ నేపధ్యంలో సుబ్రమణ్యస్వామి దేశవాణిజ్య రాజధాని ముంబాయిలో ఒక ఇంటర్వ్యూలో ” జి ఎస్ టి వల్ల ఆర్ధిక వ్యవస్ధేమీ మారిపోదు. పన్ను విధానం సింపుల్ అవ్వడం తప్ప ఇందువల్ల మరే ప్రయోజనమూ లేదు” అని స్పష్టం చేశారు.
”తమను నష్టపరచే జి ఎస్ టి వద్దని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ప్రధాని నరేంద్రమోదీ ని స్వయంగా కలిసి వివరించారు. దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు ఇదే స్టాండ్ తో వున్నాయి.” అని కూడా ప్రొఫెసర్ చెప్పారు.
“అంతెందుకు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నపుడు స్వయంగా నరేంద్రమోదీయే జి ఎస్ టి వద్దని కేంద్రప్రభుత్వానికి రాశారు” అని సుబ్రమణ్యస్వామి వివరించారు…ఇదే ఈ ఇంటర్యూకి కొసమెరుపు.