నర్సరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం దాడులు నిర్వహించింది.హైదరాబాద్లోని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై శనివారం తెల్లవారుఝాము వరకు సోదాలు జరిగాయి.కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ .. ఇటీవల పనులు చేయలేక చేతులెత్తేసింది. దీంతో నవయుగ కంపెనీని ప్రభుత్వం రంగంలోకి దింపింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీలో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు శ్రీధర్ అనే వ్యక్తి కూడా భాగస్వామి.
ప్రస్తుతం వేరే కంపెనీలతో పనులు చేయిస్తున్నా… సాంకేతికకంగా ట్రాన్స్ట్రాయ్ పోలవరం నిర్మాణంలో భాగస్వామినే. నిర్మాణ పురోగతిలో వేగం కనిపించకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వం 60సి కింద నోటీసులు జారీ చేసి కొన్ని పనులను వేరే సంస్థలకు అప్పగించారు. బిల్లులన్నీ ట్రాన్స్ ట్రాయ్ ద్వారా ఆయా కంపెనీలకు ఎస్ర్కో ఎకౌంట్ ద్వారా చెల్లిస్తున్నారు. అయితే ఈ బిల్లులు చెల్లింపులో ట్రాన్స్ట్రాయ్ సీజిఎస్టీ చెల్లించడంలేదని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. పనులన్నీ పూర్తయ్యాక సీజిఎస్టీ చెల్లిస్తామని, ఇప్పటికే కొంత చెల్లింపులు కూడా జరిగాయని ట్రాన్స్ ట్రాయ్ వర్గాలు చెబుతున్నాయి.
సీజీఎస్టీ కోసం ఆకస్మికంగా దాడులు నిర్వహించడంలో రాజకీయ కుట్ర ఉందని రాయపాటి అనుచర వర్గం ప్రచారం చేస్తోంది. సీజీఎస్టీ చెల్లింపు అనేది నిరంతర ప్రక్రియ అని, నోటీసులు ఇవ్వకుండా దాడులు నిర్వహించడం పట్ల ట్రాన్స్ ట్రాయ్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కుట్రలో తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. నిజాలేమిటో బయటకు రావాల్సి ఉంది.