ఆంధ్రప్రదేశ్ ఐటీ , పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ ,వెటకారాలు రావడానికి కారణం ఆయన చెప్పే తలా, తోకా లేని విషయలే. రుషికొండ మీద రుషులు తపస్సు చేస్తారనే స్టేట్ మెంట్ దగ్గర్నుంచి… చలి ఎక్కువగా ఉంటుంది.. స్నానం చేయరని.. అందుకే దావోస్ వెళ్లలేదని కబుర్లు చెప్పడం వరకూ ఆయన ప్రతీ స్టేట్మెంట్ ఆయనను నవ్వులపాలు చేసిందే. ఆయన ఇతరులను మళ్లీ కామెడీ చేస్తున్నట్లుగా మాట్లాడుతూంటారు. తాజాగా ఆయన మరోసారి ఇలాంటి కామెంట్లు చేశారు. ఏపీలో కోడి గుడ్డు పెట్టిందని.. అది పెట్ట కావడానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
మంత్రి చెప్పిన ఈ మాటకు లాజిక్కేమిటో చాలా మమందికి అర్థం కాదు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసింగ్ చూసేందుకు ఆయన వెళ్లారు. అక్కడ మీడియా కనిపిస్తే మాట్లాడారు. హైదరాబాద్ అంర్జాతీయ రేస్ కు వేదిక కావడం సంతోషమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తెలుగు వాళ్లు కలిసి నిర్మించిన నగరమన్నారు. అంత వరకూ బాగానే ఉందికానీ.. ఏపీలోనూ అలాంటి నగరం లేదా అని అంటారేమోనని.. ఏపీలో కోడి గుడ్డు పెట్టింది..పెట్ట కావడానికి టైం పెడుతుందని చెప్పుకొచ్చారు. అప్పుడు ఏపీలోనూ ఈ రేసులు పెడతామని చెప్పుకొచ్చారు. అంటే.. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనే గుడ్డు పెట్టారని.. అది పెరిగి పెద్దవుతుందని ఆయన ఉద్దేశం కావొచ్చని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఓ వైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశ్రమల కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూంటారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటారు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం.. పరిశ్రమల కోసం మనం వెళ్లడమేంటి.. మన కోసమే పరిశ్రమలు వస్తాయన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సు కోసం .. ముంబై వెళ్లి పెళ్లికి పిలిచినట్లుగా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ఇచ్చి రావడం కూడా నవ్వుల పాలవుతోంది. ఎవరైనా ఇలాంటి పెట్టుబడుల సమావేశాలకు వెళ్తే… బిజినెస్ మీటింగ్స్ నిర్వహిస్తారు. కానీ అమర్నాథ్ ఇన్విటేషన్ కార్డు చేతిలో పెట్టి వచ్చారు.