ఇదిగో మూడు రాజధానులు… అదిగో మూడు రాజధానులు అంటూ వైసీపీ నేతలు మాయ చేయడం మాత్రం మానుకోలేదు. ఈ విషయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ లీడ్ తీసుకుంటున్నారు. ఎప్పుడు ప్రెస్మీ ట్ పెట్టినా ముందో ..వెనుకో..చివరో మూడు రాజధానులు చేస్తామని చెబుతూ వస్తున్నారు. అయితే ఎలా చేస్తారన్నదానిపై ఆయనకు కూడా క్లారిటీ లేదు. పార్టీ ఆఫీస్ నుంచి అలా చెప్పమని ఆదేశిస్తే అలా చెబుతున్నారు కానీ.. తనను ఫూల్ చేస్తున్నారనే సంగతిని ఆయన గుర్తించలేకపోతున్నారు. మూడు రాజధానులు అనే అంశాన్ని హైకోర్టు కొట్టి వేసింది. అమరావతి నిర్మించాలని ఆదేశించింది. అదే ఫైనల్. కోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి.
లేకపోతే ఆ తీర్పును ఆమోదించినట్లే. కానీ ప్రభుత్వం ఇంత వరకూ సుప్రీంకోర్టుకు వెళ్లలేదు.ఆ బిల్లు పోతే పోయింది.. ఇంకో బిల్లు పెడదామనే అతి తెలివి తేటలకూ అవకాశం లేదు. రాజ్యాంగపరంగా అలాంటిచాన్స్ లేదు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం మూడు రాజధానుల బిల్లు పెడతామంటూ హడావుడి చేస్తున్నారు. వైసీపీ ఆడుతున్న రాజకీయ ఆటలో రాష్ట్ర భవిష్యత్ మూడు రాజధానులు.. అమరావతి మద్య ఇరుక్కుపోయింది. మూడున్నరేళ్లలోరాష్ట్ర ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల సంపదను నిర్వీర్యం చేసినా.. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పోయింది మా సొమ్ము కాదు కదా అని ఇంకా పట్టుకుని లాగుతూనే ఉన్నారు. మూడు రాజధానుల పేరుతో అసలు ఎక్కడా అభివృద్ధి లేకుండా చేసేశారు.
విశాఖలో భూదందాలకు దిగారన్న విమర్శలు వస్తున్నా తగ్గడం లేదు. అసలు రాజ్యాంగపరంగా సాధ్యం కాదని తెలిసి కూడా.. రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాన్ని అనుభవిస్తున్నవారు ప్రకటనలు చేయడం .. అతి అనిపిస్తున్నా.. వెనక్కి తగ్గడం లేదు. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి.. వ్యవస్థపై నిందలేయడానికి వెనుకాడని రాజకీయంలో నేతలు చెలరేగిపోతున్నారు.