వైసీపీ నేతలకు మడమ తిప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయింది. ఏదైనా అంటే.. వెంటనే కొడాలి నాని డైలాగ్ తరహాలో అమ్మ మొగుడు చెప్పాడా అంటూ ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు మూాడు రాజధానులకు మద్దతుగా రాజీనామా ల విషయంలోనూ రెండు రోజులకే అదే పద్దతిలో మాట్లాడటం ప్రారంభించారు. తాము ఎందుకు రాజీనామా చేయాలంటూ గుడివాడ అమర్నాథ్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేస్తామని ఎవరూ చెప్పలేదని ఆయనంటున్నారు. మంత్రులు చెప్పిన దానికి కొత్త కొత్త అర్థాలు వివరిస్తున్నారు.
విశాఖ రాజధాని కోసం రాజీనామాలకు సిద్ధమని మంత్రి ధర్మాన ప్రకటించారు. తర్వాతి రోజు అదే ఊపును కంటిన్యూ చేస్తూ.. కరణం ధర్మశ్రీ రాజీనామా చేసేశారు. అది స్పీకర్ ఫార్మాట్లో లేకపోయినా స్పీకర్ ఫార్మాట్లో ఉందని ప్రచారం చేశారు. సీఎం ఆదేశిస్తే రాజీనామాలు చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో అందరూ ఇక రాజీనామాలు చేయడమే తరువాయి అనుకున్నారు. కానీ.. సీన్ మారిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా మాట మార్చేసారు. రాజీనామాలు చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి మాత్రమే రాజధాని కావాలని తెలుగుదేశం కోరుతోంది. కాబట్టి దాని కోసం వారు రాజీనామా చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ సభ్యులు రాజీనామా చేశారు. ఇక్కడ మా ఆకాంక్షకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు, మేమెందుకు రాజీనామా చేయాలని ఎదురు వాదిస్తున్నారు. మొత్తంగా రాజీనామాలు చేస్తే.. సర్వం కోల్పోవడం ఖాయమని తెలిసి వచ్చిందేమో కానీ మాట మార్చేశారు. వీరి తీరు చూసి సామాన్య జనం కూడా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.