రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో ఆయన నిర్వహించిన తొలి సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఇటీవల సమన్వయకర్తగా తొలగించిన ఉరుకూటి చందుతో సహా పలువురు కీలక నేతలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
నిజానికి ఊరుకూటి చందు అనే నేతలకు టిక్కెట్ ఇప్పించింది అమర్నాథే. భారీగా ఖర్చు పెట్టింది.. డబ్బులు వసూలు చేసి.. చివరికి వచ్చే సరికి అమర్నాథే తన టిక్కెట్ కు ఎసరు పెట్టడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డిని సమన్వయకర్తగా తొలగించిన నాటి నుండి పార్టీలో నేతల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకూటి చందును వైసీపీ అధిష్టానం దేవన్ రెడ్డి స్థానంలో సమన్వయకర్తగా నియమించి పార్టీ టికెట్ అతనిదేనంటూ ప్రచారం చేసింది.
ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చందును తప్పించి గుడివాడ అమర్నాథ్ను ఆ స్థానంలో పోటీకి నిలబెట్టనున్నట్లు పార్టీ అధిష్టానం వెల్లడించింది. నియోజకవర్గంలో తన మాట చెల్లలేదన్న అసంతృప్తితో ఎమ్మెల్యే నాగిరెడ్డి, తనకు ఆశ చూపి సీటు అమర్‌కు కేటాయించారన్న మనస్థాపంతో ఉరుకుటి చందు.. అమర్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. ఆయన అనుచరులు కూడా చాలామంది ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డితో బుజ్జగింపులకు ప్రయత్నిస్తున్నారు.