జగన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్లుగా బూతులతో పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఆకాశానికి, నేలకు మధ్యలో ఇరుక్కుపోయారు. ఆయనకంటూ ఇప్పుడు నియోజకవర్గం లేకుండా పోయింది. తన నియోజకవర్గం అనకాపల్లికి ముక్కూ ముఖం తెలియని వ్యక్తిని ఇంచార్జుగా నియమిస్తే.. ఆయనకు బాధ్యతలు అప్పగించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆయనకు నియోజకవర్గం కేటాయించలేదు.
వైవీ సుబ్బారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత ఆయనను క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారు. పెందుర్తి ఇస్తాం రెడీగా ఉండమని సలహా ఇచ్చారు. కానీ తర్వాత రిలీజ్ చేసిన జాబితాలోనూ పెందుర్తి పేరు లేదు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్… గత ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి మెప్పించేలా పని చేశారు . అంటే ల్యాండ్, శాండ్ సహా ఎలాంటి పనులు చేస్తే జగన్ రెడ్డికి ఇష్టమో అన్నీ చేశారు. అందుకే వ్యతిరేకత ఉందని ప్రచారం ఉన్నా జగన్ రెడ్డి ఆయనకే టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు. మరి అమర్నాథ్ పరిస్థితి ఏంటి ?
ఆయనకు ఇచ్చే పరిస్తితి ఉంటే ఈ పాటికి ప్రకటించి ఉండేవారని.. చివరి వరకూ వెయిట్ చేయించి… పరిస్థితులు అనుకూలించలేదని చెప్పి ఆయనను పక్కన పెట్టే కసరత్తు నడుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలోనూ ఆయన కాస్తయిన తన అసంతృప్తిని చూపించకపోతే జరిగేది ఇదేనని.. గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అమర్నాథ్ గుడ్డు పొదగదని.. తర్వాత తేలిపోతుందన్న వాదన వినిపిస్తోంది.