రాష్ట్ర మంత్రివర్గంలో జగన్ తర్వాత గుడివాడ అమర్నాథ్కు సెక్యూరిటీ పరంగా ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. కొత్త మంత్రుల్లో డిప్యూటీ సీఎంలకు కూడా లేని విధంగా గుడివాడ అమర్నాథ్కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మంత్రి ఒక్కరే ఉన్నారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కూడా ఉండటంతో ఆయన అక్కడ కూడా పర్యటించాల్సి ఉంది. పార్టీ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకోవాల్సి ఉంది.
ఈ పరిస్థితుల్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గుడివాడ అమర్నాథ్ సెక్యూరిటీనీ ప్రభుత్వం రివ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. అమర్నాథ్ కాన్వాయ్‌లో కొత్తగా బులెట్ ఫ్రూఫ్ కార్లను చేర్చారు. భద్రతను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జగన్‌తో కలిసి దావోస్‌లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు అమర్నాథ్. తిరిగి వచ్చిన వెంటనే సెక్యూరిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఏజెన్సీలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు హె్చచరికలు వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిణామాలతో భద్రత పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఇతర సీనియర్ల కన్నా జగన్‌తో ఎక్కువ సాన్నిహిత్యం అమర్నాథ్కు ఉంది. తాజాగా సెక్యూరిటీ రివ్యూ చేయడంతో ఆ విషయం మరోసారి నిరూపితమయిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.