రీ రిలీజ్లో అద్భుతాలు జరుగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే.. అదేదో కొత్త సినిమా వచ్చినట్టు ఎగబడుతున్నారు ఫ్యాన్స్. ఫ్లాప్ సినిమాల్ని సైతం రీ రిలీజ్ లో నెత్తిన పెట్టుకొంటున్నారు. `ఆరెంజ్` నే తీసుకోండి. ఫస్ట్ రిలీజ్ లో ఈ సినిమా ఫ్లాప్. నిర్మాతగా నాగబాబు తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బకి ప్రొడక్షన్ కి దూరమయ్యారు. చరణ్ పుట్టిన రోజున ఈసినిమాని మళ్లీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లు కట్టబెట్టారు. దాంతో.. ఫ్లాప్ సినిమాలతో కూడా రీ రిలీజ్ లో గిట్టుబాటు చేసుకోవొచ్చని అందరికీ అర్థమైంది. ఇప్పుడు గుడుంబా శంకర్ని రంగంలోకి దింపుతున్నారు. పవన్ పుట్టిన రోజుకి ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. దానికి సమయం ఇంకా ఉంది. ఈలోగా ఏదో ఒక అకేషన్ చూసుకొని సినిమాని వదిలేద్దామని భావిస్తున్నారు. గుడుంబా శంకర్ ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుంటుంది. పాటలు మిట్టు.. విలన్ని బకరాని చేసి ఆడుకోవడం.. గుండుంబా శంకర్ తోనే మొదలైంది. ఆ తరవాత.. ఈ ఫార్ములాని శ్రీనువైట్ల పిప్పి పిప్పి చేసి వదిలిపెట్టాడు అది వేరే విషయం. పవన్ ఫ్యాంటు మీద ఫ్యాంటు వేసుకొని.. కొత్త ట్రెండ్ సృష్టించింది ఈ సినిమాతోనే. కొన్ని సీన్లు.. ఫన్నీగా ఉంటాయి. కాకపోతే… అప్పట్లో పవన్ కల్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉండేవి. వాటిని ఆ సినిమా అందుకోలేకపోయింది. మరి.. ఈసారి అభిమానులు హిట్ చేసేస్తారేమో చూడాలి. ఒక వేళ రీ రిలీజ్లో ఈ సినిమా హిట్టయిపోతే.. పంజా, అన్నవరం లాంటి సినిమాల్నీ వరుస పెట్టి వదులుతారేమో?