రైతు బంధు పథకంలో భాగంగా రైతులందరికీ లబ్ది కలిగిస్తామన్న తెలంగాణ సర్కార్ కొన్ని ఆంక్షలు పెట్టింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ..రైతు బంధు పథకం అమలు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 23న సీసీఎల్ఏ జాబితాలోని పట్టాదార్లకు మాత్రమే రైతుబంధు పథకం అమలు చేస్తారు. ప్రతి సీజన్‌కు ముందు భూముల లావాదేవీలు పరిశీలించి.. అమ్మిన భూములు జాబితా నుంచి తొలగిస్తారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో సాయం చేస్తారు. నిధులు మొత్తం ఒకే సారి విడుదల చేసే పరిస్థితి లేదు కాబట్టి.. దశల వారీ నిధుల విడుదలలో తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. రైతుబంధు అమలు కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు.
రైతుబంధు సాయాన్ని వదులుకునేవారు గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని.. ఆ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి రైతు బంధుకు సంబంధించిన రైతుల వివరాలు మొత్తం ప్రభుత్వం వద్ద ఉన్నాయి. పథకం ప్రారంభించినప్పుడు అన్ని వివరాలతో చెక్కులు జారీ చేశారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల సమయంలో.. నేరుగా బ్యాంక్ ఖాతాలో వేశారు. అయితే.. ఆ తర్వాత పథకం అమలు కుంటు పడింది. అసలు ఇస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. గత రెండు సీజన్లలో సగానికిపైగా రైతులకు పథకం అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ సీజన్ వచ్చింది. రెండు పంటల సీజన్లలోనూ సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు నియంత్రిత పంటల సాగు అనే విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
దానికి అంగీకరించిన వారికే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. పథకం సొమ్మును ఎగ్గొట్టాడనికే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ రైతులు అందరూ నియంత్రిత వ్యవసాయానికి ఒప్పుకున్నారంటూ కేసీఆర్ ప్రకటించి అందరికీ పథకం వర్తింప చేస్తామన్నారు. ఇప్పుడు మళ్లీ భూరికార్డుల ప్రకారం ఇస్తామని చెబుతున్నారు. ఇవన్నీ.. రైతుల్లో గందరగోళానికి దారి తీస్తున్నాయి.