తెలంగాణలో రైతు రుణమాఫీ చేసేందుకు నిధులను సమీకరించుకుంటున్నట్లు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
ఎవరికి రుణమాఫీ అవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏయే రుణాలు మాఫీ అవుతాయన్న అంశాలపై రెండ్రోజుల్లో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని… అసలు, వడ్డీ అన్నీ కలిపి 2లక్షల వరకు గరిష్టంగా ఒక్కొక్కరికీ రుణమాఫీ వర్తిస్తుందని పొంగులేటి తెలిపారు.
ఇక రైతు భరోసాపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భరోసా ఎవరికి ఇవ్వాలి, కౌలు రైతుల పరిస్థితి ఏంటీ, అసలు రైతులను ఎలా గుర్తించాలి, పంట పండే భూములు ఏవీ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రేపటి నుండి పనులు ప్రారంభిస్తుందని… రైతుల నుండి అభిప్రాయాలు సేకరిస్తుందని తెలిపారు. ఖమ్మం నుండి రైతుల అభిప్రాయ సేకరణ మొదలుపెడుతున్నారు. ఈ కమిటీలో మంత్రి పొంగులేటితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, తుమ్మల ఉన్నారు.