హైదరాబాద్: గుజరాత్లోని పటేల్ సామాజికవర్గం ఆ మధ్య రిజర్వేషన్కోసం తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపిన సంగతి తెలిసిందే. 25 ఏళ్ళుకూడా లేని హార్థిక్ పటేల్ అనే యువకుడు పటేల్ సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తమ ఉద్యమంతో కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలను వణికించాడు. రెండునెలల క్రితందాకా ఆ ఉద్యమం జోరుగా సాగిందిగానీ ఈ మధ్య పెద్దగా వార్తల్లో లేదు. అయితే తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ వారి రిజర్వేషన్లపై స్పష్టీకరణ ఇచ్చారు. పాటీదార్(పటేల్) సామాజికవర్గాన్ని ఓబీసీ క్యాటగిరీలో చేర్చే సమస్యేలేదని నిన్న స్పష్టీకరించారు. పాటీదార్లను ఓబీసీలో చేర్చి మిగిలిన సామాజికవర్గాలను నష్టపరిచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. కేవలం 5% పాటీదార్లే రిజర్వేషన్లకోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు.
తమ సామాజికవర్గాన్ని ఓబీసీలో చేర్చమని పాటీదార్లు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి ఆనందిబెన్ ఇలా తేల్చిచెప్పటం గుజరాత్లో అన్నివర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవైపు పాటీదార్ల ఉద్యమంతో సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాలలో కాంగ్రెస్ బలపడుతుండగా, మరోవైపు ఈ నెల 29నుంచి తాలూకా, జిల్లా పంచాయతీల ఎన్నికలు జరగబోతుండగా ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేయటం అధికార బీజేపీలోనే కలకలం సృష్టిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికలలో ఓబీసీ, ఇతర కులాలే కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టే ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యలు చేశారని మరో వాదన వినిపిస్తోంది.