పాటిదార్ల ఆందోళన దృష్ట్యా ఆర్థికంగా వెనకబడిన వారి పేరిట గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ చెల్లబోదని హైకోర్టు కొట్టి వేసింది. రాజ్యాంగం కేవలం ఎష్సిఎస్టిలకు సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వచ్చని చెబుతున్నది తప్ప ఆర్థిక వెనకబాటు గురించి మాట్లాడటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.న్యాయమూర్తులు రోహిణి,జయంత్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునివ్వడం దిగిపోతున్న ముఖ్యమంత్రి ఆనందిబెన్ కంటే బిజెపి కే రాజకీయంగా ఎదురుదెబ్బ. ఎందుకంటే వారు రాజస్థాణ్లో గుజ్జర్లు, హర్యానాలో జాట్లు తదితర తరగతుల రిజర్వేషన్ ఆందోళనను ఎదుర్కొంటున్నారు. జాట్లకు రిజర్వేషన్ల కల్పన కూడా ఇలాగే నిలవకుండా పోయింది.గుజ్జార్లను ఎస్టిలో చేర్చడానికి అక్కడ స్థానిక ఎస్టిలు సిద్ధంగా లేరు.మొత్తంపైన రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారం రిజర్వేషన్ జాబితాను పెంచుకుంటూ పోవడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏదాదికి ఆరులక్షల వరకే ఆదాయంవున్న వారిని ఆర్థిక వెనుకబాటు కోటాలో గుజరాత్ ప్రభుత్వంచేర్చింది. అయితే 2015లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ అప్లయిడ్ రిసెర్చి సంస్థ ఒక అమెరికా విశ్వవిద్యాలయంతో కలసి నిర్వహించిన సర్వే ప్రకారం దేశ జనాభాలో 2.5శాతం మందికి మాత్రమే ఈ మేరకు అదాయం వస్తుంది. అంటే మిగిలిన 97.5శాతం మంది ఈ తరహా రిజర్వేషన్‌కు అర్హులవుతారు. అంతేగాక రిజర్వేషన్ కోటా మొత్తం యాభై శాతం దాటరాదన్న నిబంధనను కూడా ప్రభుత్వం పాటించలేదని జయంతి భారు అనే సామాజిక కార్యకర్త కేసు దాఖలు చేశారు. మరి ఈ తీర్పు తర్వాత ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి.