రాజకీయాల్లో అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి పరుగులు పెట్టడానికి 70 ఏళ్లు దాటిన గులాం నబీ ఆజాద్ పోటీ పడుతున్నారు. ఆయన కశ్మీర్లో సొంత పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించారు. పేరు ఏమిటన్నది ఆయన చెప్పలేదు. సహజంగానే తన పార్టీ పేరును ప్రజలు నిర్ణయిస్తారని పాత కాలం రాజకీయ నాయకుడి వ్యూహాలే అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలుగా ఎదిగి…ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న సొంత పార్టీనే నామరూపాల్లేకుండా చేసిన వారెందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో గులాం నబీ ఆజాద్ చేరుతున్నారు.
జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్ సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు.. సొంత పార్టీని నిర్వీర్యం చేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. వారు పార్టీలు పెట్టుకున్న చోట కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు కశ్మీర్లో ఆ బాధ్యతను గులాంనబీ ఆజాద్ తీసుకున్నారు. నిజానికి బాగా వయసులో ఉన్నప్పుడు… ఫైర్ మీద ఉన్నప్పుడు చాలా మంది కాంగ్రెస్ ను వీడి పార్టీలు పెట్టుకున్నారు. కానీ విచిత్రంగా గులాం నబీ ఆజాద్ . . అన్ని శక్తులు ఉడిగిపోయిన తర్వాత పార్టీ పెట్టుకుంటున్నారు.
కశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. కానీ ఈ సారి మాత్రం ఆజాద్ పార్టీ ఆ బలాన్ని సగానికి తగం తగ్గించనుంది. మొత్తంగా బీజేపీకి మేలు చేయడానికి ఆజాద్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికి డీలిమిటేషన్ తమకు అనుకూలంగా చేసుకున్నారని బీజేపీపై విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో కశ్మీర్ కు సంబంధం లేని వారిని కూడా ఓటర్లుగా నమోదు చేయడానికి ఇటీవల అంగీకరించారు. ఇలాంటి పరిణామాలకు తోడు ఆజాద్ కొత్త పార్టీ కశ్మీర్ రాజకీయాల్లో కొత్త తరహా వాతావరణ పరిస్థితులు కల్పిస్తున్నాయి.