ఆటలో గెలుపు ఓటములు కాదు. క్రీడా స్ఫూర్తి ముఖ్యం. ఈ విషయంలో ఆఫ్గనిస్థాన్ క్రికెటర్ గుల్బాదీన్కు మైనస్ మార్కులు పడతాయి. ఈరోజు టీ 20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఆఫ్గనిస్థాన్ బంగ్లాదేశ్ని ఓడించి సెమీస్ లో అడుగుపెట్టింది. అయితే.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడి, అభిమానుల విమర్శలకు గురవుతోంది. అసలు ఏం జరిగిందంటే..
ఈరోజు సూపర్ 8లో భాగంగా బంగ్లాదేశ్, ఆఫ్గన్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ 114 పరుగులకే పరిమితమైంది. ఆ తరవాత బంగ్లా బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. 11.4 ఓవర్ల సమయంలో బంగ్లా 7 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అప్పుడే మళ్లీ వర్షం చిన్నగా మొదలవుతుంది. సరిగ్గా అక్కడ మ్యాచ్ ఆగిపోతే డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఆఫ్గనిస్థాన్ 2 పరుగుల తేడాతో విజయం సాధిస్తుంది. మరుసటి బంతికి బౌండరీ తరలిస్తే.. బంగ్లా గెలుస్తుంది. ఈ సమీకరణాల్ని గమనించిన ఆఫ్గనిస్థాన్ కోచ్ మైదానం బయటి నుంచే ‘నెమ్మదిగా ఆడండి..’ అంటూ సంకేతాలు పంపాడు. అది గమనించిన గుల్బదీన్ కాలి కండరాలు పట్టేసినట్టు యాక్ట్ చేస్తూ.. సడన్ గా పడిపోయాడు. దాంతో సహాయ సిబ్బంది వచ్చి ట్రీట్మెంట్ చేసింది. ఈలోగా వర్షం పెద్దదై, మ్యాచ్ ఆగిపోయింది. ఆ తరవాత వర్షం తగ్గి, మళ్లీ మ్యాచ్ కొనసాగిందనుకోండి. అది వేరే విషయం. కానీ… కేవలం మ్యాచ్ ని ఆపేయాలన్న ఉద్దేశంతో గుల్బాదీన్ చేసిన ఈ డ్రామా.. క్రీడాభిమానులకు నచ్చలేదు. క్రీడా స్ఫూర్తికి ఇది విరుద్ధమంటూ కొంతమంది మాజీలు ఆఫ్గన్ క్రికెటర్లపై మండిపడుతున్నారు. ఆఫ్గన్ అభిమానులకు సైతం ఈ ఘటన రుచించలేదు. ‘ఇదేం బాలేదు’ అంటూ సోషల్ మీడియాలో తమ జట్టుకు సుద్దులు నేర్పుతున్నారు. క్రీడామైదానంలో ‘ఆస్కార్ లెవల్ యాక్టింగ్’ అంటూ కామెంటేటర్లు కూడా ఆఫ్గన్ జట్టుపై సెటైర్లు వేశారు. ఈ ఘటనపై ఐసీసీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.