డాక్యుమెంటరీకి సినిమాకీ చాలా తేడా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా తీయడం డాక్యుమెంటరీ. దాన్ని జనం చూసేలా, వెండి తెర భాషలో మార్చి తీస్తే సినిమా. దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డికి డాక్యుమెంటరీ స్థాయి ఉన్న అంశాన్ని సినిమాగా మలచడం బాగా వచ్చు. ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ సినిమాలతో అది రుజువైంది. ఓ క్లిషమైన అంశాన్ని సినిమా భాషలోకి అనువదించి ప్రశంసలు అందుకొన్నారు. అవార్డులూ వచ్చాయి. అయితే సమస్య – సినిమా భాష రెండూ సరిగా మేళవిస్తేనే సక్సెస్. ఆ లెక్క తప్పితే మాత్రం.. ప్రేక్షకుడి తలబొప్పి కట్టడం ఖాయం. సునీల్ కుమార్ రెడ్డి చేసిన ఇటీవల ప్రయత్నాలు ఇలానే తయారయ్యాయి. మరి తాజా సినిమా ‘గల్ఫ్’ పరిస్థితేంటి? ఇది డాక్యుమెంటరీనా? లేదా కమర్షియల్ సినిమానా?? లేదంటే రెండింటి మధ్య నలిగిపోయిందా??
* కథ
శివ (చేతన్ మద్దినేని)ది తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరు. నాన్న (నాగినీడు) చేనేత కార్మికుడు. శివ కులవృత్తి చేయలేక, దాంతో వస్తున్న డబ్బులతో జీవితం గడపలేక గల్ఫ్ వెళ్దామనుకొంటాడు. ఊర్లో మిత్రుడు గల్ఫ్ వెళ్లి, బాగా డబ్బులు సంపాదించడం చూసి, అక్కడి జీవితంపై ఆశలు పెంచుకొంటాడు. తీరా అక్కడకు వెళ్లాక.. గల్ఫ్ జీవితం ఎంత దుర్భరమో అర్థం అవుతుంది. అక్కడ్నుంచి రాలేడు.. అలాగని అక్కడ ఉండలేడు. అక్కడే తనలానే అవస్థలు పడుతున్న లక్ష్మి (డింపుల్)ని ఇష్టపడతాడు. లక్ష్మికీ చాలా సమస్యలే ఉంటాయి. అమ్మ ఆరోగ్యం కోసం.. గల్ఫ్ వచ్చి కష్టపడుతుంటుంది. సేట్ లక్ష్మిని నానా బాధలకు గురి చేస్తుంటాడు. ఈ ప్రేమ జంట గల్ఫ్‌లో పడిన కష్టాలేంటి?? అక్కడ్నుంచి పారిపోవాలనుకొన్న ప్రయత్నాలు ఫలించాయా, లేదా?? అనేదే గల్ఫ్ కథ.
* విశ్లేషణ
గల్ఫ్ వెతల్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రమిది. దర్శకుడి ఉద్దేశమూ అదే కాబట్టి ఆ మేరకు సక్సెస్ అయ్యాడనుకోవాలి. అయితే… పేపర్లు తిరగేసేవాళ్లకు, టీవీలో స్పెషల్ స్టోరీలు చూసేవాళ్లకు తెలియని విషయాలేం లేవు ఇందులో. దళారీల చేతిలో అమాయకులు ఎలా మోసపోతున్నారు?? గల్ఫ్ మాయలో పడి ఇక్కడ అప్పులు చేసి, అక్కడ ఉద్యోగాలు చేసుకోలేక, జీతాలు సంపాదించలేక, వడ్డీల ఊబిలో సామాన్యుడు ఎలా కూరుకుపోతున్నాడు? పేరు గొప్ప – ఊరు దిబ్బ అన్నట్టు వాళ్ల జీవితాలు మేడిపండులా ఎలా మారుతున్నాయన్న పాయింట్‌ని దాటి ఈ కథలో ఏం చెప్పలేకపోయాడు దర్శకుడు. టీవీలో ఓ సమస్యని చిన్న స్టోరీలా నడిపినట్టు సాగిందీ సినిమా. నిజానికి ఈ సినిమా సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. వాయిస్ ఓవర్లో సాయికుమార్ ఏమైతే సమస్యల్ని లేవనెత్తాడో అవే తెరపైనా కనిపించాయి. వాయిస్ ఓవర్‌తో అయిపోయే కథని రెండున్నర గంటల సినిమాగా మలిచాడు దర్శకుడు. సినిమాలో అరవై సన్నివేశాలుంటే.. ఆ అరవై కూడా గల్ఫ్ సమస్యల్ని ఏకరువు పెట్టినట్టు సాగితే – సగటు ప్రేక్షకుడు రిలీఫ్ ఫీలయ్యేది ఎక్కడ? సీరియెస్‌గా సాగే కథలు తీయకూడని కాదు. ఆ ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో కలగాలంటే, దర్శకుడు చెప్పాలనుకొన్న అంశం సూటిగా ప్రేక్షకుడి గుండెల్లో గుచ్చుకోవాలంటే.. అందుకు తగిన కసరత్తు సన్నివేశాల రూపకల్పనలోనే సాగాలి.
ఈ కథకు వీలైనంత కమర్షియల్ కోటింగు ఇవ్వాలనుకొన్నాడు దర్శకుడు. అందుకే మసాలా అద్దడానికి ఏమాత్రం మొహమాట పడలేదు. కథానాయికలిద్దరి ఎద అందాలను నిస్సిగ్గుగా 70 ఎమ్.ఎమ్‌లో చూపించాడు. పడగ్గది దృశ్యాల్నీ బంధించడానికి ఆలోచించలేదు. బీప్‌తో డైలాగులు వినిపించకుండా చేయడం ఓ పద్దతి. ఏకంగా కొన్ని డైలాగులు మొత్తం లేచిపోయాయి. అక్కడేదో బూతు జోకు పడడం – చుట్టూ ఉన్న పాత్రలు నవ్వుకోవడం.. ఆ డైలాగే వినిపించకుండా చేసినప్పుడు ఆ నవ్వుల్ని మాత్రం క్యాప్చర్ చేయడం ఎందుకు..?? బడ్జెట్ పరిమితులు దర్శకుడ్ని చాలా ఇబ్బంది పెట్టాయి. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి యేడాదైంది. ఇంకా ఆ నోట్లనే ఈ సినిమాలో చూపించారు. అంటే యేడాది క్రితం తీసిన సినిమా ఇదన్నమాట. కనీసం పాత నోట్లను సీజీల్లో మార్చుకోవాలన్న ఆలోచన కూడా దర్శకుడికి రాలేదు. సెట్లో తీసిన సన్నివేశాల్ని గల్ఫ్ అన్నట్టు భ్రమింపచేయడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. పతాక సన్నివేశాల్లో హృదయాల్ని పిండేసే సీన్ ఒకటుంది. కానీ.. అంతకు ముందు నడిపిన కథని సరిగా డీల్ చేయకపోవడం వల్ల హార్ట్ టచింగ్ సీన్ కూడా… ఇలా వచ్చి, అలా వెళ్లిపోయినట్టు అనిపించింది.
* నటీనటుల ప్రతిభ
చేతన్, డింపుల్ ఇద్దరూ కొత్తవారే. ఈ కథకు వీళ్లు సరిపోతారు కూడా. చేతన్ ఓకే అనిపిస్తాడు. డింపుల్ హీరోయిన్ లా కాకుండా పక్కింటి అమ్మాయిలా సహజంగా కనిపించింది. అనుభవజ్ఞులైన నటీనటులు ఉన్నా.. వాళ్లకు దొరికినవి చిన్న చిన్న పాత్రలే. పోసాని, నాగినీడు, అదుర్స్ రఘు, నల్ల వేణు, తనికెళ్ల భరణి వీళ్లవన్నీ ఒక రోజు కాల్షీట్ల పాత్రలు. వాళ్లూ చేయడానికి ఏం లేకుండా పోయింది.
* సాంకేతిక వర్గం
లో బడ్జెట్లో తీసిన సినిమా కాబట్టి, టెక్నికల్ టీమ్ లో లోపాల్ని కప్పిపుచ్చలేకపోయింది చిత్రబృందం. ప్రవీణ్ పాటలు బాగున్నా – కథకు అడ్డం పడేవే. పులగం సంభాషణలు అక్కడక్కడ మెప్పిస్తాయి. మెరుపులు ఉన్నా – సన్నివేశాలకు ప్రాణం పోయడానికి అక్కడక్కడ మాటలు సహాయ పడినా, అవి ఇంకా బలంగా ఉండాల్సింది అనిపిస్తే ఆ తప్పు ప్రేక్షకుడిది కాదు. బహుశా.. దర్శకుడు రచయితకు తగినంత స్వేచ్ఛ ఇవ్వలేదేమో. దర్శకుడిగా సునీల్ కుమార్ రెడ్డి ఈసారి విఫలం అయ్యాడు. ఈ సినిమాని పూర్తిగా వాస్తవిక కోణంలో తీసినా అవార్డులకు పనికొచ్చేదేమో. జనం చూడరన్న భయంతో కమర్షియల్ టచ్ ఇచ్చి.. దాన్ని రెంటికీ కాకుండా చేశాడు.
* ఫైనల్ టచ్ : గల్ఫ్.. కష్టాలు, కన్నీళ్లూ…
తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5