ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న గుమ్మనూరు జయరాంపై.. వారానికో వివాదం వెలుగులోకి వస్తోంది. అన్నీ సాక్ష్యాధారాలతో సహా పట్టుబడుతున్నాయి. ఇది విపక్షాలు విమర్శలు చేయడానికి బాగానే ఉపయోగపడుతోంది కానీ.. అసలు ఆ వివరాలన్నీ ఎలా బయటకు వస్తున్నాయనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. మొదట.. గుమ్మనూరులో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వహణ విషయం బయటకు వచ్చింది. తన నియోజకవర్గం ఆలూరులో అంతా తాను నియమించుకున్న పోలీసులే ఉన్నా.. ఆయన రైడింగ్‌ను ఆయన ఆపలేకపోయారు. పైగా.. పోలీసులపై దాడి చేయడం వంటి ఘటనలు జరిగి… రాష్ట్రం మొత్తం చర్చించుకునేలా చేశారు. పెద్దల ఆదేశాలు లేకపోతే.. పోలీసులు ఇలా మంత్రి కనుసన్నల్లో నడుస్తున్న వ్యవహారంపై చర్యలు తీసుకునే అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయం.
పేకాట విషయంలోనే కాదు.. ఆ వివాదం సద్దుమణగక ముందే మంత్రి పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దొంగ డాక్యుమెంట్లతో కొన్నారని పత్రాలు కూడా బయటకు వచ్చాయి. అలా ఎలా వచ్చాయో.. మంత్రికి కూడా అంతు బట్టలేదు. తాను రైట్ రాయల్‌గా కొన్నానని.. దొంగ పత్రాలు అమ్మిన వాళ్లు పెట్టారని ఆయన సమర్థించుకునే ప్రయత్నంలో తంటాలు పడుతున్నారు. అది అలా ఉండగానే.. ఆయన బెంజ్ కారు చర్చల్లోకి వచ్చింది. ఆయన లంచంగా బెంజ్ కారు తీసుకున్నారన్నదానికి సాక్ష్యాలుగా ఒక్కొక్కటి టీడీపీ బయట పెడుతోంది. అవి ఎలా వచ్చాయో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
ఈ మొత్తం వ్యవహారాలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టి చూస్తే… గుమ్మనూరు జయరాం టార్గెట్‌లో వైసీపీలోనే అంత్గత రాజకీయం జోరుగా నడుస్తోందన్న అభిప్రాయం.. అంతటా వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లాలో.. చాలా మంది సీనియర్లు మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. గుమ్మనూరు జయరాం రెండో సారి గెలిచారు. ఆరేడు సార్లు గెలిచిన వారు… జిల్లాపై పట్టు సాధించిన నేతలు మంత్రి పదవి కోసం ఉన్నారు. రెండున్నరేళ్ల తర్వాత జగన్ చేయబోయే మంత్రి వర్గ ప్రక్షాళనలో .. తన సీటును బీసీ కోటా నుంచి జయరాం సుస్ధిరం చేసుకోకుండా… ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారన్న చర్చ వైసీపీలో నడుస్తోంది. అందుకే.. ఒక్కో సీక్రెట్ బయట పెడుతున్నారని అంటున్నారు.
నిజానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలందరూ.. ఇలాంటి దందాల్లో రాటుదేలిపోయారు. ఆ విషయంలో చాలా మంది బయటపడుతున్నారు. కొంత మంది సీక్రెట్‌గా ఉన్నారు. అయితే రోడ్డున పడుతోంది మాత్రం జయరాం మాత్రమే. దీన్ని బట్టి… పై స్థాయి నుంచే జయరాం గురించి లీకులు బయటకు వస్తున్నాయని.. ఆయనను పక్కాగా టార్గెట్ చేశారని అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.