ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరో స్కాం ఆరోపణలు చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన నాలుగు వందల ఎకరాలను కుటుంబసభ్యులు, బినామీల పేరుతో సొంత దారుల నుంచి బెదిరించి లాక్కున్నారని… వాటిని తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన పత్రాలు బయట పెట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుమ్మనూరు జయరాం కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ భూములన్నీ ఎక్కువగా ప్లాటినా అనే కంపెనీకి సంబంధించినవి. మరికొన్ని రైతులవి. ఇద్దరు సోదరుల భార్యలపైనా రెండు వందల ఎకరాలపైగా రిజిస్ట్రేషన్ చేశారు. మిగతావి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని.. మంత్రి అయ్యన్న ఆరోపించారు.
సోదరుల భార్యల పేరుపైకి మారిన భూముల వివరాలను వెల్లడించారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా అయ్యన్న మీడియాకు చూపించారు. కొన్ని భూములను ప్లాటినా అనే కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అలా అమ్మడానికి ఆ కంపెనీ బోర్డు అంగీకరించిందనే ఓ పత్రాన్ని కూడా రిజిస్ట్రేషన్ కోసం వాడుకున్నారు. కానీ ఆ పత్రం ఫోర్జరీదనే ఆరోపణలు ఉన్నాయని అయ్యన్న అంటున్నారు. అదే సమయంలో సేల్ డీడ్లోనూ.. చిత్రమైన విషయాలు ఉన్నాయి. మామూలుగా నోట్ల రద్దు తర్వాత కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఎలాంటి లావాదేవీ అయిన రూ. రెండు లక్షలకు మించి నగదు వ్యవహారం జరగకూడదని నిబంధన. అయితే.. ఇక్కడ రూ. 52 లక్షల రూపాయలు నగదు ఇచ్చినట్లుగా సేల్ డీడ్‌లో నమోదు చేశారు.
అంతంత సొమ్ము ఎలా తెచ్చారు..? ఎక్కడి నుంచి తెచ్చారు.? అసలు నిబంధనల ప్రకారం ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితే ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయరాం పదవి వచ్చినప్పటి నుండి సంపాదనలో పడ్డారనే ఆరోపణలు వస్తున్న సమయంలో.. ఈ తాజా స్కాం మంత్రికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి రూ. కోటి కిపైగా విలవైన కారును గిఫ్ట్‌గా తీసుకున్నారన్న ఆరోపణలపై ఇంకా సంతృప్తికర సమాధానం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు భూస్కాం చుట్టుముట్టింది. అదే సమయంలో ఆయన కుటుంబీకులు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ వ్యవహారం దుమారం రేగింది. ఈ వ్యవహారంపై వైసీపీ అగ్రనేతలు ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది.