ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్.. దాంతో పాటు భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా.. ఈఎస్ఐ స్కాంలో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లుగా బలమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ ఇటీవలి కాలంలో సరికొత్త బెంజ్ కారుతో తిరుగుతున్నారు. దాని విలువ రూ. కోటి రూపాయలు ఉంటుంది. అయితే అది ఆయన కొనుగోలు చేసి ఉంటే సమస్య ఉండేది కాదు.. బహుశా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై చర్చలు పెట్టేవారు. కానీ ఆ కారు.. ఈఎస్ఐ స్కాంలో పధ్నాలుగో నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. కానీ అది పేరుకే.. మొత్తం యజమానికి మాత్రం.. మంత్రి జయరాం కుమారుడే.
షోరూమ్‌లో వాహనం తీసుకోవడం దగ్గర్నుంచి ఆ వాహనంతో అదే పనిగా తిరుగుతూ.. ఫోటో షూట్లు చేయించుకుంటూ.. సోషల్ మీడియాలో పెడుతూ.. ఆనందం పొందుతున్నారు. డెలవరీ తీసుకున్నది కూడా జయరాం కుమారుడే. అయితే.. ఇప్పుడు ఆ కారు ఓనర్ మాత్రం.. ఈఎస్ఐ స్కాంలో నిందితుడిది. మిగతా వారు.. రోజుల తరబడి జైల్లో ఉన్నా.. గుమ్మనూరు జయంరాం కుమారుడికి కారు ఇచ్చిన కార్తీక్ మాత్రం.. నాలుగైదు రోజుల్లోనే బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. ఓ మెడికల్ ఎజెన్సీ ఉన్న కార్తీక్ .. . కార్మిక మంత్రి అయిన గుమ్మనూరు జయరాం నుంచి లబ్ది పొందారనే ప్రచారం ఉద్ధృతంగా ప్రారంభమయింది.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారంపై ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదుల కోసమంటూ ప్రారంభించిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి.. మొత్త వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అవినీతిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెబుతోందని.. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నానని అంటున్నారు. ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపిస్తామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని ఇప్పుడు ఆధారాలు చూపిస్తున్నామని మంత్రి ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.