మంత్రి గుమ్మ నూరు జయరాం టీడీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైంది. టీడీపీ తరపున జడ్పీటీసీగా గెలిచిన తరవాత వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయనకు ఆలూరులో టిక్కెట్ నిరాకరించడంతో… పక్క చూపులు చూస్తున్నారు. కర్నూలు ఎంపీ టిక్కెట్ వద్దే వద్దంటున్న ఆయన మాటల్ని జగన్ ఆలకించలేదు. అందుకే రాప్తాడు సిద్ధం సభకు జనాల్ని తరలించలేదు..తాను కూడా వెళ్లలేదు.
రాప్తాడులో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నరని నియోజ వర్గంలో స్పష్టం అయింది. టిడిపి లో వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. జయరాం కు అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ దాదాపు ఖరారు అయినట్టే అంటూ నియోజకవర్గం మొత్తం చర్చ నడుస్తోంది. అంతేగాక గుమ్మనూరు జయరాం రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలను పిలిపించుకొని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్య చరణ పై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈనెల 23న పార్టీకి తన పదవికి రాజీనామా చేసి టిడిపి కండువా కప్పు కుంటున్నారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. అయితే ఆయనకు ఆలూరు టిక్కెట్ లేదని.. అనంతపురం జిల్లా గుంతకల్లు టిక్కెట్ ఆఫర్ చేశారని చెబుతున్నారు. కాటసాని బ్రదర్స్ ను ఓడించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం గుంతకల్లు నుంచి కాటసాని బ్రదర్స్ లో ఒకరైన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఓడించేందుకు గంతకల్లుకు మారాలని జయరాం కూడా డిసైడయ్యారు. ఆలూరు నుంచి టీడీపీ తరపున కోట్ల కుటుంబసభ్యులు పోటీ చేసే అవకాశం ఉంది.