ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ధీటైన సమాధానంగా తాను బీసీని అనే నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన అవినీతిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. స్వగ్రామంలో పేకాట డెన్ నిర్వహించడమే కాదు.. ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి రూ. కోటి విలువైన కారును గిఫ్ట్‌గా తీసుకున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. తాజాగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు.. ఓ భూకుంభకోణాన్ని బయట పెట్టారు. ఇట్టినా ప్లాంటేషన్ అనే కంపెనీకి సంబంధం లేని వ్యక్తులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెద్ద ఎత్తున ఆ కంపెనీకి సంబంధించిన భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆ ఆరోపణల సారాంశం. దానికి సంబంధించిన పత్రాలను కూడా అయ్యన్నపాత్రుడు బయట పెట్టారు.
అయితే ఈ వ్యవహారంపై మంత్రి గుమ్మనూరు జయరాం స్పందన భిన్నంగా ఉంది. తన భూలావాదేవీలపై ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకపోగా.. బీసీ మంత్రిపై ఆరోపణలు చేయడం క్షమించరాని నేరమని మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు కొనసాగిస్తే.. బీసీ పవర్ చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడుకి మతి భ్రమించిందని మండిపడుతున్నారు. జయరాం తీరు ఇప్పుడు వైసీపీలోనే కలకలం రేపుతోంది. ఓ ప్రణాళిక ప్రకారం.. వైసీపీ నుంచే… జయరాం అవినీతికి సంబంధించిన ఆధారాలను లీక్ చేస్తున్నారని.. ఆయనను టార్గెట్ చేశారనే సానుభూతి ఆ పార్టీలో కనిపిస్తోంది.
మరో వైపు జయరాం బయటకు తీసిన బీసీ కార్డును టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేతల్ని ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు .. బీసీలు అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడును రెండున్నర నెలలకుపైగా జైలులో ఉంచారు. కానీ ఆయన అవినీతి చేశారని ఒక్క ఆధారం లేదని ఏసీబీనే చెప్పింది. అదే సమయంలో కొల్లు రవీంద్రను ఇరికించడానికి పక్కా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయ్యన్నపాత్రుడుపైనే ఏకంగా నిర్భయ కేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆధారాలతో సహా అవినీతిని బయట పెడుతూంటే.. మాత్రం తాను బీసీ అని చెప్పుకోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జయరాం తీరు చూస్తూంటే.. గురివింద సామెత గుర్తు వస్తోందని అంటున్నారు.