మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ స్థాయి విమర్శలు అసలు లెక్కలోకి రావడానికి గుమ్మనూరు జయరామే ఉదాహరణ. మంత్రిగా ఉన్నప్పుడు జయరాం ఏం చేశారో టీడీపీ నేతలు మర్చిపోయారు. తనపై టీడీపీ నేతలు ఏమని విమర్శలు చేశారో జయరాం మర్చిపోయారు. ఇప్పుడు ఆయన గుంతకల్లు నుంచి మరోసారి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా జయరాం .. వైసీపీ అధినేత జగన్ కు దండం పెట్టేశారు. కుట్రల్లో బలి కావడానికి తాను సిద్ధంగా లేనని చెప్పేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తారనుకున్నారు. కానీ కర్ణాటకలో మంత్రిగా ఉన్న తన సోదరుడు నాగేంద్ర సాయంతో లాబీయింగ్ చేసుకుని టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయనకు ఆలూరు కాకుండా గుంతకల్లు టిక్కెట్ కేటాయించారు. గుమ్మనూరు కూడా అంగీకరించారు.
అయితే గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అవేమీ లెక్క చేయని గుమ్మనూరు జయరాం ఎన్నికలు నాటికి అందర్నీ ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో నియోజకవర్గంలోని తిరేకలను,అసంతృప్తులను ఏకం చేసేందుకు జయరాం సోదరుడు నారాయణస్వామి, కుమారుడు ఈశ్వర్ రంగంలోకి దిగారు. మండలాల వారీగా నాయకులతో కలుస్తూ వ్యతిరేకులను అసంతృప్తులను కలిసి పార్టీకి పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో తెలియజేస్తూ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను ఏకతాటిపైకి తెచ్చి గుంతకల్లు నియోజకవర్గం లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అసంతృప్తులను ఏకం చేసేందుకు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి రంగంలోకి దింపి జితేంద్ర గౌడ్ ను పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధినేత చంద్రబాబు నాయుడు జితేంద్ర గౌడ్ కి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. స్వయంగా అధినేత హామీ ఇవ్వడంతో శాంతిచ్చిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాంకు సహకరించలని నియోజకవర్గ తెలుగుదేశం క్యాడర్ కు పిలుపునిచ్చారు.
వాల్మీకి (బీసీ) సామాజిక వర్గంలో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నేతగా గుమ్మనూరు జయరాంకు పేరుంది. ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పిఆర్పి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున 2014,2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి సామాజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు. గుమ్మనూరు జయరాం ఇప్పుడు గుంతకల్లులో ఈజీగా గెలుస్తారని మౌత్ టాక్ ప్రారంభమయింది. ఆయన వల్ల మరో రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ప్లస్ వచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. కొసమెరుపేమిటంటే… గుమ్మనూరు జయరాం రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమయింది.. టీడీపీ నుంచి జడ్పీటీసీగా ఎన్నికై .. అవకాశాల్ని అంది పుచ్చుకుంటూ అటూ ఇటూ జంప్ అవుతూ… ఎదుగుతున్నారు.