అమెరికాలో నల్లజాతి యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన కొప్పు శరత్ అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మిస్సోరిలోని కేన్సస్సిటీ రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమయంలో శరత్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆరు నెలల కిత్రమే అమెరికాలో ఎంఎస్ చేసేందుకు శరత్ వెళ్లాడు. శుక్రవారం శరత్ తన స్నేహితులతో పాటు కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో కొందరు నల్లజాతీయులు వచ్చి గన్‌తో వీరిని బెదిరించారు. వీరు తిరగబడటంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో అమెరికాలో ఉన్మాదంతో.. కాల్పులు జరుపుతున్న ఘటనలు తరచూ బయట పడుతున్నాయి. తుపాకుల అమ్మకాలపై నియంత్రణ లేకపోవడంతో.. అవి మారణాయుధాలుగా మారాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లజాతీయాల్లో ఆభద్రత పెరిగిపోవడం… వారికి ఉపాధి అవకాశాలు పరిమితమవడంతో.. దోపిడీలకు పాల్పడేందుకు ఈ తుపాకుల్ని ఎక్కువగా ఉపయోగించుకుటున్నారు. అదే సమయంలో… జాతి వివక్ష దాడులు కూడా పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి వివక్ష కారణంగానే చంపారు. ఇప్పుడీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను ఓ నల్లజాతి యువకుడు. అతను కాల్పులకు ముందు రెస్టారెంట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. సమాచారం అందించాల్సిందిగా కోరారు. అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా..అన్నదాన్ని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొప్పు శరత్ మృతదేహాన్ని అన్ని లాంఛనలు పూర్తి చేసి.. భారత్‌కు పంపడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. కొప్పు శరత్ తండ్రి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. కుమారుడి మరణంతో ఆయన కుటుంబ తల్లడిల్లి పోతోంది.