అమెరికాలో గన్ కల్చర్ ప్రభావం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. న్యూ ఒర్లిన్స్ నగరంలో తొమ్మిదవ వార్డులో గల బన్నీ ఫ్రెండ్ పార్క్ లో ఆదివారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు చనిపోయి ఉండవచ్చని సమాచారం. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంగతి తెలుసుకొన్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకొని గాయపడిన వారినందరినీ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందించారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల చెప్పిన దాని ప్రకారం, ఆదివారం రాత్రి స్థానిక కాలమాన ప్రకారం సుమారు ఏడు గంటలకు బన్నీ ఫ్రెండ్ పార్క్ లో ఒక మ్యూజిక్ వీడియో ఫిలిం షూటింగ్ జరుగుతోంది. దానిలో పాల్గొనేందుకు సుమారు 300మందికి పైగా ప్రజలు తరలి వచ్చేరు. అదే సమయంలో రెండు వర్గాలకు మధ్య ఏదో ఒక విషయంపై చిన్నగా ఘర్షణ మొదలయింది. చివరికి అది కాల్పుల వరకు దారి తీసింది. వారిలో ఒక వ్యక్తి మెషిన్ గన్ తో తన ప్రత్యర్ధి వర్గంపై కాల్పులు జరిపినట్లు, అప్పుడు ప్రత్యర్ధి వర్గం కూడా అతనిపై కాల్పులు జరుపగా అతను తప్పించుకొని పారిపోయినట్లు వారు తెలిపారు. ఈ కాల్పులలో ఎవరయినా మరణించారా, మరణిస్తే ఎంత మంది అనే విషయం ఇంకా పోలీసులు దృవీకరించలేదు. కానీ 10 మంది వరకు చనిపోయి ఉండవచ్చని అనధికార సమాచారం.