పట్టపగలు హత్యలు జరిగిపోతున్నాయి. మిట్టమధ్యాహ్నం దాడులు జరిగిపోతున్నాయి. మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత యువతిపై అత్యాచార ఘటనలు జరుగుతూంటాయి…. చివరికి తుపాకీ కాల్పులూ వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో పరిస్థితి ఇది. టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసుపై కడప జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో కాల్పుల మోత మోగింది.
కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ ెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న కమలాపురం నియోజకవర్గంలోని పాయసం పల్లె గ్రామంలో వైసీపీలో రెండు వర్గాలున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా వాట్సాప్ గ్రూప్ లలో న్యూ ఇయర్ శుభాకాంక్షల ఫోటోలు పెట్టుకున్నారు. అయితే.. ఇందులో తమ వర్గాన్ని కించ పరిచేలా పోస్టులు పెట్టారని మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కర్రలు, కత్తులతో ఇరువర్గాల పరస్పర దాడులకు పాల్పడటంతో భయానక వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాలు దాడులకు పాల్పడుతున్న సమయంలోనే ఓ వర్గ నేత సుధాకర్ రెడ్డి తుపాకీ తీసుకు వచ్చి ఇష్టానుసారంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సుధాకర్ రెడ్డికి ఎలాంటి గన్ లైసెన్స్ లేదని పోలీసులు చెబుతున్నారు. అక్రమంగా గన్ కొనుగోలు చేసి.. సెటిల్మెంట్ల కోసం ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నేతలు.. ఇలాంటి ఆయుధాలు సమకూర్చున్నారన్న ఆరోపణలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటనతో కడప జిల్లా వ్యాప్తంగా కలకలం రేగుతోంది. వరుస ఘటనలు పోలీసుల వైఫల్యానికి సాక్ష్యంగా మారుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలైతే.. వారికి చట్టం వర్తించదన్నట్లుగా పరిస్థితి మారింది.