గుణశేఖర్ మంచి మేకర్. అంతకంటే మంచి కథకుడు. తన స్క్రీన్ ప్లే బాగుంటుంది. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ లాంటి చిత్రాల్లో బలమైన కథలుంటాయి. అయితే.. ఈమధ్య టెక్నికల్ విషయాలపైనే గుణశేఖర్ ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తోంది. దానికి పెద్ద ఉదాహరణ `రుద్రమదేవి`. పైకి గుణశేఖర్ ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ, బాహుబలికి ధీటుగా ఈ సినిమాని తీద్దామనుకొన్నాడు గుణ. అందుకు తగినట్టుగానే పాపులర్ తారాగణాన్ని ఎంచుకొన్నాడు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా భారీగా ఖర్చు పెట్టి మరీ తీశాడు. `బాహుబలి`కీ `రుద్రమదేవి`కీ సాంకేతికంగా తేడా కనిపించాలన్న ఉద్దేశంతో `రుద్రమదేవి`ని త్రీడీలో రూపొందించాడు. అయితే ఆ త్రీడీ ఎఫెక్టులు పెద్దగా కనిపించలేదు. త్రీడీ కోసం సినిమా ఆలస్యమైంది. ఖర్చు పెరిగింది. అయినా పెద్దగా ఒరిగిందేం లేదు. అంతకు ముందే కల్యాణ్ రామ్ `ఓం` సినిమాని త్రీడీలో తీశాడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. త్రీడీ ఎఫెక్టులు ఆ సినిమాకి కలసి రాలేదు. తెలుగులో రాజమౌళి కూడా త్రీడీ అంటే భయపడిపోతాడు. ఆ జోలికి ఏమాత్రం వెళ్లడు. పైగా మన వాళ్లు త్రీడీ ఫార్మెట్ కు పెద్దగా అడాప్ట్ కాలేదనిపిస్తుంది కూడా. అయినా సరే, గుణశేఖర్ ఇప్పుడు `శాకుంతలమ్`ని త్రీడీలో చూపించాలన్న నిర్ణయం తీసుకొన్నాడు. దీని వల్ల ఇంకొంత డబ్బు, సమయం ఖర్చవుతాయి. అందుకు తగిన ప్రతిఫలం ఉంటుందా అంటే ఆ గ్యారెంటీ లేదు. పైగా ఇప్పటికే ఈ సినిమాపై బాగా ఖర్చుపెట్టాడు గుణశేఖర్. త్రీడీతో మరింత బడ్జెట్ పెరుగుతుంది. అయినా ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నాడో?