సినిమాపై ప్యాషన్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ సబ్జెక్ట్ నచ్చితే ఎంతైనా ఖర్చు పెడతారు. గుణశేఖర్ కూడా అంతే. తన కలల చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి ఏం చేయడానికైనా సిద్దమే. అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్లో `శాకుంతలం` ఇంత భారీగా రూపుదిద్దుకొంది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాపై ఇంత బడ్జెట్ పెట్టడం భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఇదే తొలిసారి అని దిల్ రాజు, గుణశేఖర్లు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ సినిమాని 2డీలోనే విడుదల చేద్దామనుకొన్నారు. కానీ దిల్ రాజు ప్రోత్సాహంతో త్రీడీ వెర్షన్‌లోకి మార్చారు. అందుకోసం ఆరు నెలలు శ్రమించాల్సివచ్చింది. త్రీడీ వల్ల బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. అయినా సరే, దిల్ రాజు వెనుకంజ వేయలేదు. దిల్ రాజు పెట్టుబడి పెడుతుంటే.. గుణశేఖర్ సైతం షాకైపోయారట. ”చాలా మంది తెలుగు సినిమాల గురించి పెద్దగా తెలియనివాళ్లు ఈ విజువల్స్ చూసి సమంత ఏమైనా దిల్ రాజు కూతురా.. ఇంతగా ఖర్చు పెట్టేశారు` అని నన్ను అడిగారు`” అంటూ శాకుంతలం ప్రెస్ మీట్ లో గుణశేఖర్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే… ఈ సినిమాపై అటు గుణ, ఇటు దిల్ రాజు ఎంత నమ్మకం పెట్టుకొన్నారో అర్థమైంది.
”త్రీడీలో సినిమా తీయాలన్నది నా ఛాయిసే. ఇందుకోసం బడ్జెట్ పెరుగుతుందని తెలుసు. కానీ కొన్ని షాట్స్‌ని త్రీడీలో చూశాక.. ఇలాంటి సినిమాని త్రీడీలోనే చూపించాలని అనిపించింది. అందుకే ఖర్చు ఎక్కువైనా వెనుకంజ వేయలేదు. ఈ సినిమాలో విజువల్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ త్రీడీలో చూస్తే బాగుంటుంది. ఈ వేసవిలో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తారు. వాళ్లలో పిల్లలూ ఉంటారు. వాళ్లని ఆకర్షించడానికే త్రీడీ యత్నం” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అన్నట్టు ఈ సినిమా రన్ టైమ్‌ని కూడా షార్ప్ గానే కట్ చేశారు గుణశేఖర్. 2 గంటల 19 నిమిషాల్లోనే ఈ సినిమా ముగుస్తుంది.