నిండా మునిగినోడికి చలి ఉండదు అంటారు. తెగించినోడికి తెడ్డే ఆయుధం అంటారు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు గుణశేఖర్ పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమాను అటు ప్రేక్షకులు ఆదరించక, ఆర్ధికంగా నష్టాల పాలై, ఇటు ప్రభుత్వమూ గుర్తించక… నలువైపులా ఇబ్బందుల పాలైన గుణశేఖర్ ఇంతకన్నా పోగొట్టుకునేది ఏముంటుందిలే అనుకున్నట్టున్నారు… ఏదేమైనా, ప్రస్తుతం తెలుగు నాట పూర్తి వివాదాస్పదంగా మారిన నంది అవార్డుల ఎంపిక ఈ అభిరుచి కలిగిన దర్శకుడిని మౌనంగా ఉండలేని పరిస్థితికి తెచ్చింది.
తాజాగా గురువారం మాట్లాడిన గుణశేఖర్ మరోసారి నేరుగా తీవ్ర విమర్శలు చేశారు. రుద్రమదేవిన తెలంగాణ వాసి కాబట్టే, అవార్డ్ కు అర్హత లేదనడాన్ని ఆయన ఖండించారు. ఆమె తెలుగువారికే కాదు జాతీయ నాయకురాలు అని, అందరికీ సంబంధించిన చారిత్రక యోథురాలనీ. తెలంగాణకు పరిమితం చేయడం సరికాదని స్పష్టం చేశారు. అంతేకాదు… అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పురస్కారంకి ఎంపిక చేయడం కూడా తనకు నచ్చలేదంటున్న గుణశేఖర్…ఈ అవార్డ్ అతడిని అవమానించడమే అన్నారు. అంత మంచి హీరోని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కావాలనే తగ్గించారన్నారు. అంతటితో ఆగని ఈ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్‌లో గుత్తాధిపత్యం నడుస్తోంది అంటూ ఎటువంటి శషభిషలు లేకుండా తేల్చేశారు. ఇలా విమర్శించడం తన భవిష్యత్తు అవకాశాలను దెబ్బతీస్తుందనే విషయంపై కూడా ఆయనకు క్లారిటీ ఉన్నట్టుంది. అందుకే దీని గురించి మాట్లాడుతూ… నంది అవార్డులపై విమర్శిస్తే 3 సంవత్సరాల పాటు అవార్డుల నుంచి నిషేధిస్తారా? అదేం పద్ధతి? అంటూ ప్రశ్నించారు.
గుణశేఖర్‌కు మద్ధతుగా మరో గొంతు కూడా గురువారం బలంగా వినిపించింది. అవార్డుల్లో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందని నిర్మాత బుజ్జి ఆరోపించారు. ఉత్తమనటుడి అవార్డ్‌కు ప్రభాస్ అర్హుడని అతనికి ఎందుకు ఇవ్వలేదు? అంటూ ప్రశ్నించారు. అవార్డులు ఎంపికలో రుద్రమదేవి సినిమాకు తీవ్రమైన అన్యాయం జరిగింది అని స్పష్టం చేశారు.