రుద్రమదేవి సినిమా మొత్తానికి హైలెట్ అయిపోయిన పాత్ర గోనగన్నారెడ్డి. నిజానికి ఆ సినిమా చూశాక…. రుద్రమదేవిగా అనుష్క కంటే, గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటన గురించే ఎక్కువ మాట్లాడుకున్నారు. ఆసినిమాకి కాస్తో కూస్తో వసూళ్లు దక్కాయంటే కారణం.. గన్నారెడ్డి పాత్రే. ఆ తరవాత.. `గోనగన్నారెడ్డి` కథతో గుణశేఖర్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం ముమ్మరంగా సాగింది. బన్నీ కూడా అందుకు రెడీగా ఉన్నాడని చెప్పుకున్నారు. దీనిపై తొలిసారి గుణశేఖర్ స్పందించాడు. గోనగన్నారెడ్డి పాత్ర నేపథ్యంలో సినిమా తీసే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశాడు. కాకపోతే… ఆ పాత్రతో సినిమా తీస్తే బాగుంటుందని చాలామంది సలహాలు ఇచ్చార్ట. కొంతమంది `గోనగన్నారెడ్డి` సినిమా చేయమని ఒత్తిడి కూడా చేశార్ట. కానీ.. గుణశేఖర్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడట.
“రుద్రమదేవి చరిత్రలో గోన గన్నారెడ్డి పాత్ర చాలా స్వల్పం. దాన్నే మేం కొంచెం పొడిగించి, కాస్త కల్పన జోడించి ఆ పాత్రని పెంచాం. అలాంటిది ఆ పాత్ర నేపథ్యంలో ఓసినిమా తీయమంటే చాలా కష్టం. అప్పుడు లేనిపోని కథలు, కల్పనలూ జోడించాల్సి వస్తుంది. ఆ పాత్ర ఔచిత్యమే దెబ్బతింటుంది. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు“ అని చెప్పుకొచ్చాడు గుణ. ప్రస్తుతం `శాకుంతలమ్` తెరకెక్కిస్తున్నాడు గుణ. సమంత కథానాయిక. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయిపోయిందట. మిగిలిన సగం సినిమా కోసం భారీ సెట్ల నిర్మాణం కూడా జరిగిపోయిందని, కరోనా కంగారు తగ్గిన వెంటనే… షూటింగ్ మొదలెట్టేస్తామని గుణ శేఖర్ చెప్పుకొచ్చాడు.