గుణశేఖర్ కలల ప్రాజెక్టు.. రుద్రమదేవి. ఈ సినిమా విషయంలో గుణశేఖర్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయ ప్రయాసలు ఒనకూర్చి రూపుదిద్దుకొన్న రుద్రమదేవి.. విడుదల చేయడానికీ గుణ శేఖర్ తిప్పలు పడ్డాడు. ఆఖరికి ఆ సినిమా బయటకు వచ్చింది. వచ్చిన దారినే వెళ్లింది. అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ తప్ప ఈ సినిమాలో ఏం లేదని విమర్శకులు పెదవి విరిచారు. అయితే దిల్‌రాజు మాత్రం రుద్రమదేవి చూసి పొంగిపోయాడు. గుణశేఖర్ గనుక ప్రతాపరుద్రుడు పేరుతో సీక్వెల్ తీస్తే, తానే నిర్మాతగా వ్యవహరిస్తా అని సభాముఖంగా మాటిచ్చాడు. దాంతో గుణశేఖర్‌కి ఊరట లభించింది.
అప్పుడెప్పుడో దిల్‌రాజు అన్న మాట పట్టుకొని ప్రతాపరుద్రుడు స్ర్కిప్టులో పడిపోయాడు గుణ. ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి ఆపసోపాలు పడుతున్నాడని టాక్. అయితే ఇప్పుడు దిల్‌రాజు ఓ మెలిక పెట్టాడట. ‘స్ర్కిప్టు నచ్చితే.. ఈ సినిమాలో నటించడానికి ఎవరైనా టాప్ హీరో ముందుకొస్తేనే ఈ సినిమా పట్టాలెక్కిస్తా’ అంటున్నాడట. దాంతో గుణ ఉసూరుమంటున్నాడు. ఒకవేళ దిల్‌రాజు చేయూత నిస్తే, అతని బ్రాండ్ ఇమేజ్‌ని చూపించి ఓ పెద్ద హీరోని ఒప్పించొచ్చని గుణ భావిస్తే, ఇప్పుడు ‘ముందు హీరోని తీసుకురా’ అంటూ కండీషన్ పెట్టాడు. ఇప్పుడు ప్రతాపరుద్రుడెవరో తెల్చకొని, ఆ హీరోకి కథ వినిపించి, ఆకన దిల్‌రాజు ముందుకెళ్లాలి. అప్పటి వరకూ ఇంకెన్నేళ్లు పడుతుందో?