‘శాకుంతలం’ తరవాత గుణశేఖర్ ఓ సినిమా చేశాడు. పేరు.. ‘యుఫోరియా’. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. అంతా కొత్తవాళ్లే. టెక్నికల్ టీమ్ కూడా కొత్తదే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, నిర్మాతగానూ బాధ్యత తీసుకొన్నాడు గుణశేఖర్. ఈరోజు గ్లింప్స్ విడుదల చేశాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా కథేమిటి? ఇందులోని పాత్రలు ఏం చేస్తాయి? అనే విషయాలు చెప్పలేదు. గ్లింప్స్ తో కాన్సెప్ట్ అర్థమైంది. యువత – డ్రగ్స్.. ఈ పాయింట్ చుట్టూ ‘యుఫోరియా’ కథ నడిపినట్టు గింప్స్ చూస్తే తెలిసిపోతోంది. కాలేజీలో మత్తు పదార్థాల దందా ఎక్కువైపోయిందని, యువత వాటికి అలవాటు పడి, జీవితాలు నాశనం చేసుకొంటోందని వార్తల్లో చూస్తున్నాం. వింటున్నాం. గుణశేఖర్ కూడా ఇదే థీమ్ ని ఎంచుకొన్నాడు. కాలేజీల్లోకి డ్రగ్స్ కల్చర్ ఎలా వస్తోంది? వాటి మత్తులో యువత ఏం చేస్తోంది? అనే విషయాన్ని ఇందులో రియలిస్టిక్ గా ఆవిష్కరించినట్టు అర్థం అవుతోంది.
డ్రగ్స్ కల్చర్ వల్ల ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆ మత్తులో జరుగుతున్న అత్యాచారాల్ని సైతం.. గుణశేఖర్ తన లెన్స్ లో చూపించిన సినిమా ఇది. చివర్లో.. భూమిక ఓ షాట్ లో కనిపిస్తుంది. ‘ఒక్కడు’తో భూమికని స్టార్ ని చేసేశాడు గుణశేఖర్. మళ్లీ ఇంత కాలానికి గుణశేఖర్ సినిమాలో చూసే అవకాశం దక్కింది. ఈ సినిమాలో భూమిక పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని అర్థమైంది. గుణశేఖర్ తన పంథాని మార్చి, ఈతరం ప్రేక్షకుల అభిరుచికి, ఈ ట్రెండ్ కి అనుగుణంగా సినిమా తీయాల్సిన తరుణం ఇది. ఈ గ్లింప్స్ చూస్తుంటే గుణశేఖర్ మారాడని అనిపిస్తుంది. మరి దాని రిజల్ట్ ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.