రుద్రమదేవి తరవాత కొంత గ్యాప్ తీసుకుని గుణశేఖర్ వెంటనే `హిరణ్య కశ్యప` స్క్రిప్టులో పడిపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. బడ్జెట్ కూడా ఎక్కువే. ఓ హాలీవుడ్ స్టూడియోతో కలిసి ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటి వరకూ తేలిక లెక్కల ప్రకారం బడ్జెట్ 200 కోట్లకు పైమాటే. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా అయిపోయాయి. రానా డేట్లు ఇవ్వడమే ఆలస్యం. కానీ.. రానా మాత్రం `హిరణ్య` తప్ప మిగిలిన అన్ని సినిమాలపైనా దృష్టి పెడుతున్నాడు. హిరణ్యని మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా `అప్పయ్యయుమ్.. కోషియమ్` స్క్రిప్టు కూడా ఓకే చేశాడు. ఆగస్టులో ఈసినిమా మొదలెట్టాలని భావిస్తున్నారు. ఆసినిమా పూర్తయ్యేసరికి మరో ఏడెనిమిది నెలలైనా పడుతుంది. `హిరణ్య` కంటే ముందే ఒప్పుకున్న సినిమాల్ని వరుసగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు రానా. కానీ… `హిరణ్య` ని మాత్రం అలా వదిలేశాడు. దాంతో గుణశేఖర్‌కి ఏం చేయాలో పాలు పోవడం లేదు.
మరోవైపు సురేష్ బాబు ఈ ప్రాజెక్టు కోసం ఏడెనిమిది నెలలుగా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోల్ని రంగంలోకి దింపింది ఆయనే. ఆయన సీరియస్‌నెస్ చూసే, ఈ ప్రాజెక్టుపై టైమ్ కేటాయిస్తున్నాడు గుణశేఖర్. తన చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేసి, అప్పుడు హిరణ్య జోలికి వద్దాం అని రానా భావిస్తున్నాడేమో. ఎందుకంటే బాహుబలిలా ఇది కూడా భారీ ప్రాజెక్టే. ఒక్కసారి మొదలెడితే, ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. అందుకే రానా కాస్త సమయం తీసుకుంటున్నాడు. రానా కోసం ఎప్పటి వరకూ ఆగాలో పాలుపోక గుణశేఖర్ ఎదురుచూపుల్లో పడిపోయాడు. మరి ఈ ప్రాజెక్టుకి ఎప్పుడు మోక్షం వస్తుందో?