పట్ట పగలు కిడ్నాపులు…నాటు తుపాకీలతో హత్యలు..! శిరోముండనాలు..! కులాల వేధింపులు..! ఇవన్నీ ఒకప్పుడు బీహార్‌లో కామన్. ఇప్పుడు… ఏపీలో కామన్. సాక్షాత్తూ విజయవాడలోనే .. నేరుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగిని.. జబర్దస్తీగా నడిరోడ్డుపై నాటు తుపాకీతో కాల్చి చంపి పారిపోయారు దండగులు. వారిని పట్టుకుంటామంటూ పోలీసులు హడావుడి ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో వేట సాగిస్తున్నారు. అది బాగానే ఉంది.. కానీ ఈ విష సంస్కృతి విజయవాడలోకి ఎలా వచ్చింది.. అంత ధైర్యం నేరస్తులకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు.. మౌలికమైన ప్రశ్న.
విజయవాడ ప్రశాంతమైన నగరం. కుటుంబ తగాదాలు. ఆస్తి గొడవలు లేకపోతే.. కులాల చిచ్చులో కొట్టుకునే గొడవలు తప్ప.. భారీ నేరాలు జరిగిన దాఖలాలు తక్కువ. నాటు తుపాకుల్ని తెప్పించుకుని మాఫియా స్టైల్లో మాటు వేసి హత్యలు చేయడం దాదాపుగా ఉండవు. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి కూడా విజయవాడలోకి వచ్చేసింది. ఏకంగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఉద్యోగినని.. తాను పోలీసునేనని చెప్పినా కూడా.. పాయింట్ బ్లాంక్‌లో చెప్పి కాల్చి చంపేసి పారిపోయారంటే..ఆ నిందితులకు తమ వెనుక ఉన్న భరోసా అయినా కారణం అయి ఉండాలి.. లేకపోతే.. కరుడుగుట్టిన ఇతర రాష్ట్రాలకు చెందిన సుపారి ముఠా అయినా అయి ఉండాలి.
గత ప్రభుత్వం రాజధానిగా విజయవాడను ఎంపిక చేసిన తర్వాత శాంతిభద్రతలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇప్పించింది. పోలీసు వ్యవస్థను అధునీకకరించింది. ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్ చాలా కాలం కమిషనర్‌గా ఉన్నారు. ఆ సమయంలో… పెద్ద ఘటనలేమీ జరగలేదు. కానీ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత బహిరంగంగా గ్యాంగ్ వార్లు… కాల్చివేతలు జరుగుతున్నాయి.