గుంటూరు – విజయవాడ మధ్య ప్రాపర్టీలు ఎప్పుడూ హాట్ కేకులే. అయితే గుంటూరు, చిలుకలూరిపేట మధ్య కూడా 2014-19 సమయంలో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచింది. జాతీయ రహదారి చుట్టూ పెద్ద పెద్ద వెంచర్లు వేశారు. జోరుగా అమ్మకాలు సాగాయి. అయితే… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడివక్కడ స్ట్రక్ అయిపోయాయి. పెట్టుబడి పెట్టిన వాళ్లంతా నష్టపోయారు. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేకుండా పోయారు.
గుంటూరు మర్చి యార్డు దగ్గర నుంచి పొత్తూరు.. యనమదల తోపాటు చిలుకలూరిపేటకు దగ్గరగా కూడా పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. నిజానికి అదంతా పారిశ్రామిక ప్రాంతం . గుంటూరు – చిలుకలూరిపేట పక్కన జాతీయ రహదారుల పక్కన అనేక పరిశ్రమలు…కోల్డ్ స్టోరేజీలు ఉంటాయి. అయితే అన్నీ చిన్న మధ్యతరహా పరిశ్రమలే. ఆ పరిశ్రమలకు కాస్త దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. నగరం శరవేగంగా విస్తరిస్తుందని అనుకున్నారు.
కానీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయా ప్రాంతాల్లో కాస్త సందడి కనిపిస్తోంది. మళ్లీ లావాదేవీలు పెరుగుతున్నాయి. కాస్త నివాసానికి అనుకూలంగా ఉండే స్థలాల విషయంలో ఇప్పుడిప్పుడే ఎంక్వయిరీలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు. ఇక పెట్టుబడి పరంగా అక్కడ కొని పెట్టుకుంటే బాగుంటుందనుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి రోడ్డు సౌకర్యం ఉంటే నాలుగైదు కిలోమీటర్ల వరకూ ఇప్పుడు కొనుగోలు,అమ్మకాలకు ఎంక్వయిరీలు ఉంటున్నాయి.
అమరావతి పనులు ఊపందుకున్న తర్వా.. చిలుకలూరిపేట వైపు.. గుంటూరు నగరం విస్తరించే అవకాశం ఉంది. మరో ఆరు నెలల్లో పరిస్థితి జోరుగా మారుతుందని.. చిలుకలూరిపేట వైపు.. ఎవరూ ఊహించని విధంగా రియలెస్టేట్ వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు.