దృశ్యం సినిమా కథ గుంటూరులో రిపీటయింది. అయితే ఇక్కడ క్లైమాక్స్ మారిపోయింది. బాధితురాలైన అమ్మాయి…ఆమె తల్లిదండ్రులు పోలీసు అధికారుల కుమారుడ్ని చంపకుండా.. చట్టానికి పట్టించారు. ఆ కీచకుడి తల్లిదండ్రులు పోలీసు అధికారులైనప్పటికీ.. సాంకేతిక ఆధారాలు స్పష్టంగా ఉండటంతో.. ఉన్నతాధికారులు కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గుంటూరు.. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లోనే కాదు.. ఇంజినీరింగ్ విద్యార్థుల్లోనూ చర్చనీయాంశమవుతోంది.
గుంటూరులో ఓ విద్యార్థిని.. ఆమె తల్లిదండ్రులు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ వీడియోలు… అశ్లీల వెబ్సైట్లలో ఉన్నాయని వాటిని తొలగించి.. దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు వెంటనే.. ఆ వీడియోలు పెట్టిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో కథ అంతా బయటకు వచ్చింది. ఆ విద్యార్థిని ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ యువకుడ్ని ప్రేమించింది. ఆ యువకుడు ప్రేమ నటిస్తూ.. ఆమె నగ్నదృశ్యాలను వీడియో తీశాడు. ఆ తర్వాత విడిపోయారు. ఇంజినీరింగ్ లో మరో యువకుడ్ని ప్రేమించింది. ఆ యువకుడూ అదే చేశాడు. తర్వాత ఇద్దరు యువకులు కలిసిపోయి.. ఆ యువతిని డబ్బుల కోసం వేధించడం ప్రారంభించారు. కొన్ని సార్లు డబ్బులు తీసుకున్నారు. అయినా ఆ వీడియోలు ఆశ్లీల వెబ్సైట్లో అప్ లోడ్ చేశారు.
పోలీసుల విచారణలో అనేక కోణాలు వెలుగుచూశాయి. ఆ ఇద్దరూ తమ వీడియోలను.. ఇతరులను షేర్ చేసుకున్నారు. అలా షేర్ చేసుకున్నవారు కూడా అశ్లీల వెబ్సైట్లో దృశ్యాలు పెట్టారు. అలా పెట్టిన వారిలో దంపతులైన పోలీసు అధికారుల కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు పోలీసు అధికారులు కావడంతో.. వారి వాహనాలతో హల్ చల్ చేస్తూ.. జులాయిగా తిరుగుతూ ఉండే.. ఆ యువకుడు.. పలువురు యువతుల్ని వేధించినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు.. ఈ కేసులో ఇరుక్కుోవడంతో.. తమ కుమారుడ్ని కాపాడేందుకు పోలీసు దంపతులు.. టెక్నికల్ గా ఆధారాలు అన్ని చేరిపేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ కేసు విషయం సంచలనం సృష్టించడంతో.. పోలీసు అధికారుల కుమారుడు ఉన్నప్పటికీ.. ఉపేక్షించకూడదని.. ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
పోలీసు దంపపతుల కుమారుడ్ని కూడా అరెస్ట్ చేసి.. మీడియా ముందు ప్రవేశ పెడతామని.. మీడియా వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే.. చట్టం వారి చేతుల్లోనే ఉంది కాబట్టి.. ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టం. మొత్తానికి దృశ్యం సినిమా తరహాలో సాగుతున్న ఈ ఎపిసోడ్లో క్లైమాక్స్ అమ్మాయికి న్యాయం జరుగుతుందా..? చట్టాలు మూగబోతాయా..? అన్నది ఆసక్తికరం.