వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వారే బయట పెట్టుకుంటూ ఉంటారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రజలను తనను నిలదీస్తూండటంతో.. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో ఒక్క సారిగా బరస్ట్ అయ్యారు. తనను పట్టించుకోవాలని, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సి ఉంటుందని ముస్తఫా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు.
తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేశానని, అధికారులు తనను గుర్తించాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు. పార్టీ మరోసారి గెలవాలంటే తాను మళ్లీ జనం వద్దకు వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సి ఉంటుందని ప్రస్తావించారు. తాను సూచించిన పనులు అధికారులు పక్కన పెడుతున్నారని, తన మాటను లెక్క చేయడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. అభివృద్ధి పనులకు అధికారులు సహకరించకుండా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కల్వర్టు నిర్మాణం చేయలేదని ఎమ్మెల్యే ముస్తఫా ప్రస్తావించారు. మీ అంతకు మీరే చేసుకోండి. అనుభవం ఉన్న ఎమ్మెల్యేను అయిన తనను పట్టించుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్న అన్నారు. జనాల వద్ద అడుక్కోవాల్సిన అవసరం రావొద్దంటే, అంతకుముందే మనమే పని చేసిపెట్టాలని కోరారు. జనం సమస్యలు చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ఇది పద్దతి కాదంటూ వేడుకున్నారు.
ఆయన ఆవేదనను అందరూ పాపం అని చూశారు కానీ.. ఒక్కరూ ఆపలేదు. అక్కడ ఉన్న వారిలో 80 శాతం మంది వైసీపీ కార్పొరేటర్లు.. ఎక్స్ అఫీషియో సభ్యులే. వాళ్లదీ అదే ఆవేదన..కానీ ముస్తఫా చెప్పుకున్నారు.. వాళ్లు చెప్పుకోవడం లేదు అంతే. ఒక్క గుంటూరు ఎమ్మెల్యేలదే కాదని.. రాష్ట్రంలో అందరి ఎమ్మెల్యేల పరిస్థితి అదేనని రోజూ మీడియాలో వస్తున్న వార్తలే నిరూపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు వారే నేరుగా బయట పడుతున్నారు.