సంక్రాంతి సినిమాల హంగామా మొదలైయింది. ప్రస్తుతానికి ఐదు తెలుగు సినిమాలు బరిలో దిగిపోతున్నట్లు ప్రకటనలు ఇచ్చేశాయి. కొన్ని సినిమాల ప్రమోషన్స్ కూడా జరిగిపోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నాగార్జున నా సామిరంగ, తేజ సజ్జా హనుమాన్.. ఇవన్నీ సంక్రాంతి సినిమాలే అని సదరు నిర్మాణ సంస్థలు ప్రకటించుకున్నాయి. వీటితో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు వున్నాయి.
మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, హనుమాన్ చిత్రాలు పక్కా డేట్లు ఇచ్చాయి. నా సామిరంగ, ఈగల్ సినిమాల డేట్లు రావాలి. ఈ రెండు సినిమాలు కూడా మేము సంక్రాంతి రేసులో ఉన్నామని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాయి. నా సామిరంగ నుంచి స్పెషల్ పాత్ర పోషిస్తున్న అల్లరి నరేష్ గ్లింప్స్ కూడా తాజాగా వదిలారు. ఇక ఈగల్ నిర్మాతలైతే దాదాపు ప్రతి రోజు ఏదో రకంగా మేము ఖచ్చితంగా పండక్కే వస్తామని చెబుతూనే వున్నారు.
సంక్రాంతి సినిమా సీజనే. రెండు పెద్ద సినిమాలు రావడం కామన్. కానీ ఈసారి చిన్నా పెద్దా మీడియం కలుపుకొని అరడజను సినిమాలు వున్నాయి. బావుంటే.. ఈ ఆరు సినిమాలని ప్రేక్షకులు చూసేస్తారనే మాట మాత్రం ఎగ్జాగరేషన్. ప్రేక్షకులకు సినిమా అంటే ఇష్టమే కానీ అదేదో ఉద్యమంలా చూడాలని కంకణం కట్టుకోరు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వుంటుంది.
సంక్రాంతి ముందు సలార్ వస్తుంది. అది ఎలా వున్నా ప్రభాస్ సినిమా చూడాలని డిసైడ్ అయిన ప్రేక్షకులు చూసేస్తారు. అయితే అది మంత్ ఎండ్. సాలరీ క్రెడిట్ అయిన తర్వాత తీరిగ్గా చూద్దమనే జనం.. జనవరి ఫస్ట్ వీక్ లో కూడా చూడొచ్చు. పైగా సినిమా నిలబడితే.. ప్రభాస్ సినిమా లాంగ్ రన్ ఏ స్థాయిలో వుంటుందో అందరికీ ఒక అవగాహన వుంది.
ఆ తర్వాత వారమే సంక్రాంతి సినిమాల జోరు మొదలౌతుంది. అయితే ఇప్పటికి అసలు సిసలు సంక్రాంతి సినిమాగా కనిపిస్తోంది మహేష్ బాబు గుంటూరుకారం. మహేష్ బాబుకి భారీ సంక్రాంతి రికార్డ్ వుంది. సరిలేరు లేరు నీకెవ్వరూ ఊదాహరణ తీసుకుంటే.. అదో అబౌ యావరేజ్ సినిమా. కానీ సంక్రాంతి సీజన్ మహిమతో బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెట్టింది. మహేష్ కెరీర్ లోనే ఒక హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిపోయింది. ఈ సీజన్ మహేష్ బాబుకి అంతలా కలిస్తోంది.
ఇప్పుడు వస్తున్న గుంటూరుకారం ఇంకా స్పెషల్ మూవీ. త్రివిక్రమ్ మహేష్ బాబులది క్రేజీ కాంబినేషన్. అల వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తో వున్నారు త్రివిక్రమ్. ఆయన సినిమా కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ వున్నారు. మహేష్ త్రివిక్రమ్ చివరిగా కలసి చేసిన సినిమా ఖలేజా. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కానీ మహేష్ ఫ్యాన్స్ కి ఫేవరేట్ మూవీ. ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి. సినిమా టాక్ బావుంటే.. అది నెక్స్ట్ లెవల్ కి వెళ్లి కూర్చుటుంది. ఆ జోరు ముందు మరో సినిమా కనపడటం అంత ఈజీ కాదు. కానీ సంక్రాంతి తగ్గదేలే అని మిగతా సినిమాలు కూడా రంగంలో దిగగడానికి సిద్ధమౌతున్నాయి. మిగతా సినిమాల వరుస చూస్తుంటే.. గుంటూరు కారం తమపై పెద్దగా ప్రభావం చూపదనే ధోరణి కనిపిస్తోంది.
వెంకటేష్ కి కూడా సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. కానీ ఇప్పుడు వస్తున్న సైంధవ్ సంక్రాంతి స్పెషల్ మూవీ ఏం కాదు. డ్రగ్స్ దందా, అక్రమ రవాణా నేపధ్యంలోని ఒక క్రైమ్ థ్రిల్లర్. అది ఏ సీజన్ లోనైనా ఆడుతుంది. రవితేజ ఈగల్ కూడా అంతే. అదీ క్రైమ్ థ్రిల్లరే. నాగార్జున నా సామిరంగకి కొంత సంక్రాంతి వైబ్ వుంది. వీటన్నటితో పోల్చుకుంటే హనుమాన్ పెద్ద స్టార్ కాస్ట్ బలం లేని చిత్రం. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటి మ్యాజిక్ వుంది. టీజర్ లో చాలా మంచి వర్క్ కనిపించింది. ఏ సీజన్ లో వచ్చినా బావుంటే జనం చుస్తారనే నమ్మకం ఇచ్చింది. కానీ హుమమాన్ కూడా సంక్రాంతి సినీ ఉద్యమంలోనే దిగిపోతుంది.
ఆరు సినిమాలు ఒకేసారి రావడం అంటే అదొక జూదమే. తెలుగు ప్రేక్షకులు గొప్ప సినీ ప్రియులే కానీ ఆరు సినిమాలనే థియేటర్లోనే చూడాలని సంకల్పించుకొని మారధాన్ పాల్గొనేటంత కళాపోశకులా? అనేది ప్రశ్నించుకోవాలి. తీరిక, బడ్జెట్ రెండు వుండాలి కదా. ఏదో పండగ పూట కొత్త సినిమా అని ఒకటి మహా ఐతే రెండు.. అంతే తప్పితే ఆరు సినిమాలు చుసేస్తారని అనుకోవడం అతి విశ్వాసం. పైగా బిజినెస్ పరంగా కూడా కొన్ని కష్టాలు వుంటాయి. ఎగ్జిబిటర్స్ అడ్వాన్స్ లు ఇవ్వరు. బేరాలు ఆడుతారు. ఇవన్నీ నిర్మాతలకు తెలియక కాదు.
నిజానికి ఇప్పుడు రేసులో వున్న సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం ఖచ్చితంగా సంక్రాంతికి అందుకోలేదని ఫిక్స్ చేసుకున్న చిత్రాలే. కానీ ఇప్పుడు గుంటూరు కారం వందశాతం ఖచ్చితంగా వస్తుందని తెలిసిన తర్వాత కూడా రేసుకే సిద్ధపడటం గమనార్హం. అయితే ఇందులో కనీసం ఒకటీ రెండు సినిమాలు అయినా వాయిదా పడతాయని ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చివరి నిమషం వరకూ ఈ కుర్చీల ఆట కొనసాగే అవకాశం వుంది.