Guntur Kaaram Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
– అన్వర్
‘అతడు’ ఓ మైల్ స్టోన్.
‘ఖలేజా’… ఫ్యాన్స్ తలచుకొని తలచుకొని మరీ ఉప్పొంగిపోయే సినిమా.
ఈ రెండు సినిమాల తరవాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందంటే – అందరి దృష్టీ అటు వైపు పడకుండా ఎందుకు ఉంటుంది? పైగా ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టాడు త్రివిక్రమ్. మహేష్ తో లుంగీ కట్టించాడు. బీడీ వెలిగించాడు. మాస్ డాన్సులు వేయించాడు. పైగా సంక్రాంతి బొమ్మ! అందుకే ఈ సీజన్లో పెద్ద హిట్టు కొట్టబోయే సత్తా ఈ సినిమాకే ఉందన్నది అందరి నమ్మకం. మరి ‘గుంటూరు’ ఘాటు ఎలా ఉంది? మహేష్ – త్రివిక్రమ్ కాంబో కి తగినట్టుగా ఉందా? తూకం ఏమైనా తగ్గిందా?
వసుంధర (రమ్యకృష్ణ) తన భర్త సత్యం (జయరామ్)తో గొడవ పడి వెళ్లిపోతుంది. విడాకులు తీసుకొంటుంది. అప్పటికి తనకో కొడుకు. పేరు రమణ (మహేష్ బాబు). రెండో పెళ్లి చేసుకొన్న వసుంధర రాజకీయంగా స్థిరపడుతుంది. పాతికేళ్ల తరవాత మినిస్టర్ కూడా అవుతుంది. అయితే తన రాజకీయ జీవితానికి మొదటి పెళ్లి, ఆ పెళ్లితో పుట్టిన కొడుకు అడ్డు రాకూడదని వసుంధర తండ్రి వెంకట స్వామి (ప్రకాష్ రాజ్) భావిస్తాడు. అందుకే… తనకూ, తన కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని ఓ కాగితంపై సంతకం చేయించడానికి గుంటూరులో ఉన్న రమణని హైదరాబాద్ పిలిపిస్తాడు. రమణ సంతకం చేశాడా, లేదా? ఆ ప్రయాణంలో ఎలాంటి అవరోధాలూ, ఆటంకాలూ ఎదురయ్యాయి? తల్లిపై విపరీతమైన ప్రేమ ఉన్న రమణ.. మళ్లీ తన తల్లి మనసుని ఎలా గెలుచుకొన్నాడు? అనేది మిగిలిన కథ.
చెప్పిన కథే మళ్లీ చెప్పడం, తీసిన సినిమా మళ్లీ తీయడం… ఓ ఆర్ట్. ఈ విషయంలో త్రివిక్రమ్ ని మెచ్చుకొని తీరాలి. ఆయన ప్రతీ సినిమాలోనూ అంతో ఇంతో గత సినిమాల ఛాయలుంటాయి. అది తాను తీసిన సినిమా కావొచ్చు. తాను చూసిన సినిమా కావొచ్చు. ఆఖరికి తాను చదివిన కథ కావొచ్చు. ఈ మొత్తం కథలో ‘అత్తారింటికి దారేది’ ఛాయలు కనిపిస్తుంటాయి. అక్కడ అత్తని వెదుక్కొంటూ హీరో వస్తే, ఇక్కడ హీరో అమ్మని అన్వేషించుకొంటూ వస్తాడు. అదే తేడా. తొలి రెండు మూడు సన్నివేశాలకే కథలోని సంఘర్షణ ప్రేక్షకులకు అర్థమైపోతుంది. కొడుక్కి అమ్మంటే ప్రేమ. అయితే ఆ అమ్మ చిన్నప్పుడే వదిలి వెళ్లిపోతుంది. పాతికేళ్ల తరవాత మళ్లీ ఆ అమ్మని కలిసే అవకాశం వస్తుంది. కానీ అది కూడా తెగదెంపుల కోసమే. అదీ ఒక్క సంతకంతోనే. ఆ ఒక్క సంతకం పెట్టాడా, లేదా? అన్నదే ఈ కథలో కాస్త నావెల్టీగా ఉన్న పాయింట్. దాన్ని ముందే తెరచేసిన దర్శకుడు… ఆ తరవాత ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమయ్యాడు.
హీరో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లడం, అక్కడ పాటో, ఫైటో వేసుకోవడం, మళ్లీ గుంటూరు తిరిగి వచ్చేయడం. మళ్లీ హైదరాబాద్ వెళ్లడం.. కొన్ని సీన్ల తరవాత గుంటూరు తిరుగు టపా కట్టడం. ఇదే తంతు. ఈ సినిమాకి ‘గుంటూరు టూ హైదరాబాద్ వయా.. సూర్యాపేట’ అని టైటిల్ పెట్టినా త్రివిక్రమ్ స్టైల్ లో బాగా సెట్టయ్యేది. హీరో సంతకం పెట్టేస్తే కథైపోతుంది. లేదా అమ్మ నోరు విప్పితే శుభం కార్డు పడిపోతుంది. ఇవి రెండూ జరగడానికి మధ్యలో త్రివిక్రమ్ కథని నడపడానికి నానా పాట్లూ పడాల్సివచ్చింది. త్రివిక్రమ్ పెన్ పవర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇరుకైన చార్మినార్ సందుల్లో కూడా రాయల్‌గా రోల్స్ రాయల్ నడిపేయగలడు. ఏం లేని చోట.. ఏదో ఉన్నట్టు మెస్మరైజ్ చేయగలడు. తన సీన్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. అదేంటో.. ఈ సినిమాలో మాత్రం తేలిపోయింది. దానికి కారణాలు బోలెడు. ఓ సూపర్ స్టార్ ఇమేజ్‌కి సరిపడా కథ కాదిది. పైగా హీరోకి తప్ప ఏ క్యారెక్టర్‌కీ సరైన ఆర్క్ లేదు. అన్నీ కాలక్షేపపు సన్నివేశాలే. అవి సరిగా పండలేదు. సంతకం పెట్టించడం కోసం ఓ లాయర్ (మురళీ శర్మ) తన కూతురు (శ్రీలీల)ని హీరో దగ్గరకు పంపడం దగ్గర్నుంచే ఈ కథ తిరోగమన దిశలో పరిగెట్టడం మొదలెడుతుంది. మహేష్ మందు కొడుతూ.. శ్రీలీల డాన్స్ చేస్తూ, వెన్నెల కిషోర్ పాటలు పాడుతూ తీర్చిదిద్దిన సీన్ థియేటర్లో నవ్వులు పూయిస్తే.. పూయించొచ్చు. కానీ ఈ కథలో అదో నాన్ సింక్ వ్యవహారం. కావాలని బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది. శ్రీలీలని కేవలం డాన్సులకే పరిమితం చేసిన మరో సినిమా ఇది. ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో అర్థం కాదు. తనకు ఇల్లూ వాకిలీ లేనట్టు… ఎప్పుడూ హీరో వెంటే తిరుగుతుంటుంది. తను కూడా హీరోతో పాటు గుంటూరు టూ హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంటుంది. ఓ యాక్షన్ సీన్ కీ పాటకీ మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. యాక్షన్ సీన్లో హీరోయిన్ లేదు. పాటకు ముందు మాత్రం అక్కడ ప్రత్యక్షమైపోతుంది. త్రివిక్రమ్ లాంటి రచయిత ఇంత సిల్లీగా ఈ సీన్లు ఎలా రాశాడో అర్థం కాదు.
అసలు అమ్మని కొడుకు ఎంత మిస్ అయ్యాడో, ఎంత మిస్ అవుతున్నాడో ప్రేక్షకులకు తెలిసినప్పుడే కదా, ఆ రిలేషన్‌ని, ఆ క్యారెక్టర్స్నీ ఓన్ చేసుకొంటారు. అదేం ఈ కథలో ఉండదు. ప్రేక్షకులకూ దర్శకుడు చెప్పడు. ఎవరి జీవితం వాళ్లు గడుపుతుంటే.. సడన్ గా పాత రిలేషన్స్ గుర్తొస్తాయి. ఎక్కడో గుంటూరులో తన బతుకు తాను బతుకుతున్న హీరోని కెలికి మరీ కథలోకి తెచ్చుకొంటారు. ఇలాంటి వ్యవహారాలు ఎంత ఆర్గానిక్ గా ఉంటే అంత బాగుంటాయి. కానీ ఇక్కడ కృత్రిమత్వమే బయటపడింది. ఇంత పెద్ద హీరోని పెట్టుకొని యాక్షన్ సన్నివేశాలు లేకపోతే ఎలా? అది గుర్తొచ్చే ఈ సినిమాలోనూ కొన్ని యాక్షన్ ఘట్టాల్ని డిజైన్ చేశారు. అవి కూడా కథలో లేని వ్యక్తులతోనే. జగపతిబాబు గ్యాంగ్ తో ఓ ఫైట్ ఉంటుంది. అజయ్ అండ్ కో తో ఒకటి, అజయ్ ఘోష్ టీమ్ తో ఒకటి… ఇలా ఈ సినిమాలో అక్కడక్కడ యాక్షన్ ఘట్టాలు వస్తుంటాయి. వీళ్లెవరూ కథతో డైరెక్ట్ లింక్ లేనివాళ్లే. యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేసుకోవడం కూడా ఈ సినిమాలో ఆర్గానిక్ గా జరగలేదు. జగపతిబాబు ఎందుకున్నాడో, వాడి కథేమిటో ఓ పట్టాన అర్థం కాదు. ఇలాంటి క్యారెక్టర్లు ఈ సినిమాలో కోకొల్లలు. పతాక సన్నివేశాల్లో రమ్యకృష్ణ, జయరామ్ మాట్లాడుకొంటుంటే ఎమోషన్ రావాల్సిందిపోయి.. అదేదో కామెడీ బిట్ లా అనిపిస్తుంది. కథకి, ఆయా పాత్రలకూ ప్రేక్షకులు కనెక్ట్ కానప్పుడే ఎమోషన్ సీన్లు కూడా ఇలా కామెడీ అయిపోతుంటాయి.
మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, తన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాని కాస్తో కూస్తో చూసేలా చేసింది. మహేష్ ఎనర్జీ… ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్. ‘ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదు’ అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అది అక్షర సత్యం. ఈ సినిమాలో కామెడీ తానే పండించాడు. ఎమోషన్ తానే నడిపించాడు. అయితే డైలాగ్ డెలివరీలో ‘ఖలేజా’ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీలీల మరోసారి డాన్సులకే పరిమితమైంది. మీనాక్షి చౌదరిది అతిథి పాత్ర లాంటిదే. రమ్యకృష్ణ పాత్ర హుందాగా ఉంది. ప్రకాష్ రాజ్‌ది రొటీన్ పాత్రే. అజయ్ ఓ ఫైట్ సీన్లో నవ్విస్తాడు. జగపతిబాబుది అర్థం పర్థం లేని పాత్రగా మిగిలిపోయింది. సునీల్‌ని కేవలం ఒక్క సీన్‌కే పరిమితం చేశారు. అది కూడా సరిగా రిజిస్టర్ కాదు. రాహుల్ రవీంద్రన్ కూడా అంతే.
త్రివిక్రమ్ సినిమాల్లో.. త్రివిక్రమ్ కంటే గొప్ప ఆకర్షణ శక్తి ఉండదు. తన మాటల వల్ల గానీ, టేకింగ్ వల్ల గానీ.. అందరి దృష్టీ తనవైపు తిప్పుకొంటాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ బలమైన డైలాగులు పెద్దగా వినిపించవు. ‘ఆవిడ మాట్లాడితే చెవులు మాత్రమే కాదు.. శరీరం మొత్తం వింటున్నట్టుంది’, ‘అమ్మని ఎప్పుడూ బిడ్డలకు ఏం చేశావని అడక్కు’, ‘అమ్మని కలవాలని అనుకొన్నా, గెలవాలని అనుకోలేదు’ ఇలాంటి మాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇంతకంటే గొప్పగా రాయగలిగే శక్తి సామర్థ్యాలు త్రివిక్రమ్ కి ఉన్నాయి. కానీ.. కథ, తాను రాసుకొన్న సీన్లు అంత ప్రేరణ ఇవ్వలేదేమో..? కెమెరా వర్క్ నీట్ గా ఉంది. కుర్చీ మడత పెట్టి పాట… థియేటర్లో ఫ్యాన్స్ తో గోల చేయిస్తుంది. ఆర్.ఆర్‌లోనూ తమన్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఓ ఫైట్ కోసం కృష్ణ పాత పాట ‘నా కోసమే నువ్వున్నాది’ వాడుకొన్నారు. అంతకంటే గొప్ప పాటలెన్నో కృష్ణ కెరీర్లో కనిపిస్తాయి. ఈ పాటనే ఎందుకు రీమిక్స్ చేయాలనుకొన్నారో వాళ్లకే తెలియాలి. పైగా రీమిక్స్ చేసిన విధానం కూడా అంత వినసొంపుగా ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి. కథకుడిగా త్రివిక్రమ్ తేలిపోయాడు. ఆ తప్పుని తనలోని దర్శకుడు కూడా కప్పిపుచ్చలేకపోయాడు. స్టార్ వాల్యూ ఉన్నా – బలమైన కథ, కథనాలూ లేకపోవడంతో గుంటూరు కారం ఘాటు తగ్గింది. పట్టు తప్పింది.
టోటల్ గా ఈ సినిమా ఎలా ఉందో చెప్పడానికి ఈ సినిమాలోనిదే ఓ డైలాగ్ వాడుకోవాల్సి వస్తోంది.
”కిటికీలోంచి చూసే నాన్న
తలుపులు వేసేసే అమ్మ
వీధిలో తిరిగే కొడుకు
ఉస్సూరు మనే ఫ్యాన్స్”.. ఇదీ స్టోరీ!
ఫినిషింగ్ టచ్: ‘అమ్మగారింటికి దారేది’
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్