‘గుంటూరు కారం’ టీమ్ ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తమ సినిమాపై ఫేక్ రివ్యూలూ, ఓటింగ్లూ ఇస్తున్నారంటూ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో పై ఫిర్యాదు చేసింది. బుక్ మై షో రేటింగులపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది. సినిమా కోసం టికెట్ బుక్ చేసే ముందు ప్రేక్షకులు ఇచ్చే రివ్యూల్ని పరిగణలోకి తీసుకొంటుంటారు సినీ అభిమానులు. ఆ రేటింగుల్ని కూడా ప్రభావితం చేస్తున్నారన్నరని గుంటూరు కారం టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బుక్ మై షోలో ‘గుంటూరు కారం’ చిత్రానికి 0 లేదా, 1 రేటింగు వచ్చేలా దాదాపు 70 వేల మందితో ఫేక్ ఓటింగ్ వేయించారన్నది అభియోగం. దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కారం టీమ్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కూడా ‘బుక్ మై షో’ కి తమ సందేహాలు వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేలా ఓటింగులు ఉన్నాయని, ‘గుంటూరు కారం’ చిత్రానికి వ్యతిరేకంగా ఫేక్ ఓట్లు ఎవరు వేయించారో ఆరా తీయాలని బుక్ మై షో నిర్వాహకుల్ని కోరింది.