గుంటూరు పోలీసులు సోషవ్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో చేస్తున్న పోస్టింగ్‌లు వారిని అల్లరి చేసేందుకు కారణం అవుతున్నాయి. అమరావతిలో ఓ రోడ్డును దుండగులు తవ్వేసి కంకర తీసుకెళ్లిపోయారని ఆరోపణలు వచ్చాయి. అయితే.. దొంగలు కాదని.. పక్కన ఉన్న గ్రామం వారు.. వారి గ్రామంలో రోడ్డు చెడిపోతే.. ఆ రోడ్డును తవ్వేసి తీసుకు పోయారని పోలీసులు ట్వీట్ చేశారు. దీనికి ఓ యువతి చేసిన ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ అనే కేటగిరి జోడించారు. ఆ ట్వీట్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. రోడ్డు తవ్వుకుని పోయి..మరో చోట రోడ్డేసుకోవచ్చా.. అని నోరెళ్లబెట్టారు. దీన్ని పోలీసులు సాధారణమైన విషయమే అన్నట్లుగా ప్రకటించడంతో… వరుసగా విమర్శనాత్మక ట్వీట్లు పెడుతున్నారు.
గుంటూరు పోలీసుల ఫ్యాక్ట్ చెక్ వ్యవహారం వివాదాస్పదమవడం ఇదే మొదటి సారి కాదు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీసులు గతంలో రాజకీయ విమర్శలు చేశారు. గతంలో గుంటూరు అర్బన్ అమ్మిరెడ్డి.. ఓ టీడీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న అంశంపై లోకేష్ ట్వీట్ పై ఫ్యాక్ట్ చెక్ పేరుతో ట్వీట్లు చేశారు. లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీస్ స్టేషన్ ఫుటేజీ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేయడంతో అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడానికి తీసుకొచ్చామని.. ఫ్యాక్ట్ చెక్ అమ్మిరెడ్డి కవర్ చేసుకున్నారు. తర్వాత కూడా… అదే విధంగా ఏపీ పోలీసు శాఖ స్పందించింది. విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో.. వైసీపీ కార్యకర్తలు పోలీసులతో దుందుడుకుగా ప్రవర్తించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీస్ శాఖ స్పందించింది. వైసీపీ కార్యకర్తలు దాడులు చేయలేదని మసాజ్ చేశారని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది. ఇది కూడా నెటిజన్లు పోలీసుల తీరుపై విమర్శలు చేయడానికి కారణం అయింది.
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని.. నిజాలు చెప్పాలన్న లక్ష్యంతో కొంత కాలం క్రితం.. ఫ్యాక్ట్ చెక్ అనే విభాగాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్, ట్విట్టర్ అకౌంట్ రూపొందించారు. కానీ ఇప్పటి వరకూ ఆ ఫ్యాక్ట్ చెక్ పెద్దగా ఫ్యాక్ట్స్ ను చెక్ చేసిందేమీ లేదు. కానీ ఇలాంటి విషయాలను ట్వీట్ చేసి.. పోలీసుల తీరును మాత్రం ప్రజలల్లో చర్చ జరిగేలా చేస్తున్నారు.