గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో పోలీసు వర్గాల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అమ్మిరెడ్డి పోలీస్ డిపార్టుమెంట్లో చాలా కీలకమైన అధికారిగా ఇటీవలి కాలంలో మరిపోయారు. ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితులు. అలాంటి ఎస్పీని రాత్రికి రాత్రి ఎందుకు బదిలీ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ. కొంత మంది ఆయనను కాపాడేందుకే అలా చేశారని అంటూంటే.. మరికొంత మంది బలి పశువును చేయబోతున్నారని అంటున్నారు. ఈ మొత్తానికి నేపధ్యం రఘురామకృష్ణరాజు ఎపిసోడే.
ఎస్పీ అమ్మిరెడ్డి కాల్ డేటాను చెక్ చేయాలని.. తనపై కుట్ర చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు .. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఆస్పత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈవో ధర్మారెడ్డిలతో పాటు అమ్మిరెడ్డి కుట్ర చేశారని లేఖ ఇచ్చారు. ఆ లేఖపై రక్షణ శాఖ వర్గాలు అంతర్గత విచారణ ప్రారంభించాయని.. ఈ విషయం తెలియడంతో వ్యూహాత్మకంగా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి.. పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ..రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్ అవ్వగానే తీసుకెళ్లేందుకు పదిహేను మంది సభ్యుల టీమ్‌ను ఆర్మీ ఆస్పత్రికి ఎస్పీ అమ్మిరెడ్డి పంపించారు. వారు రఘురామకృష్ణరాజు పేరుతోనే ఆర్మీ ఆస్పత్రిలో బస చేసి.. ఆ ఖర్చులు కూడా ఆయనకే పంపారు . దాంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లయింది. ఇప్పుడు విచారణ ప్రారంభించడంతో మిగిలిన విషయాలను వీలైనంత సైడ్ చేయడానికి ఆయనను పక్కన పెట్టారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారుల తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. డీఎస్పీగా చేరి ఎస్పీగా మారి… ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేనంత ప్రాధాన్యం పొందిన అమ్మిరెడ్డి తీరు మరీ వివాదాస్పదం. సోషల్ మీడియాలో ఆయన వైసీపీ ప్రచారకర్తగా వ్యవహరిస్తూంటారని అనేక సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. కేసులు పెట్టి.. వారు మొహాలకు ముసుగులు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టేంత చిల్లర వేషాలు వేస్తూంటారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఓ వర్గం వారు తనకు చెప్పేవి వినపడవు.. కనబడవు అంటూ… నేరుగా చెప్పేంత తెంపరితనం కూడా ఆయన సొంతం. మొత్తానికి ఈ వ్యవహారంలో అమ్మిరెడ్డి ఇవాళ కాకపోతే.. రేపైనా ఇరుక్కుపోతారని.. ఎస్పీగా ఆయన ప్రమోషన్ ను డిమోట్ చేసి.. మళ్లీ డీఎస్పీగా మార్చే అవకాశం కూడా ఉందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.