ఏపీలో హైవోల్టేజ్ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో గురజాల ఒకటి. టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు మరోసారి అక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరపున టిక్కెట్ దక్కించుకున్నారు. కానీ ఆయన స్థానికేతరుడు.నర్సరావుపేట నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలంతా కలిసి పని చేయడంతో ఆయన స్థానికేతర అంశం చర్చల్లోకి రాలేదు. వైసీపీ వేవ్ లో గెలిచేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై అసంతృప్తి.. ఎమ్మెల్యేలపై అసంతృప్తి మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతల్లో సగం మంది మహేష్ రెడ్డికి పని చేయడానికి సిద్ధంగా లేరు. మరో వైపు జంగా కృష్ణమూర్తి చేరికతో టీడీపీకి బలం పెరిగింది.
గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి పోరాటం హోరాహోరీగానే ఉంటుంది. రెండు పార్టీల్లో ఏ పార్టీ నాయకుడు గెలిచినా తక్కువ మెజారిటీ మాత్రమే వుంటుంది. 1952లో నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో కాసు మహేష్‌రెడ్డికి వచ్చిన మెజారిటీనే అత్యధిక మెజారిటీ. వైఎస్సార్సీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఓ పార్టీ ఓట్లకు గండిపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహేష్‌కు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో జంగా ఇటీవల టీడీపీలో చేరారు. బీసీల ఓట్లు వైఎస్సార్సీపీ నుంచి కొంతవకు టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాసు మహేష్‌రెడ్డికి స్థానిక నాయకుల మద్ధతు కూడా గత ఎన్నికల్లో మాదిరి లేదనేది పార్టీ వర్గాల వారు చెబుతున్న మాట.
నియోజకవర్గంలో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ దందా, తెలంగాణ సరిహద్దున ఉండటంతో విపరీతంగా జరుగుతున్న అక్రమ మద్యం వ్యాపారం వంటి విషయాల్లో ఎమ్మెల్యే తన స్వార్థమే చూసుకుంటున్నారని.. స్థానిక నేతలకు ప్రయోజనం కలగనీయడం లేదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మద్దతు పలికిన వారిలో సగం మంది నిర్లిప్తంగా ఉంటున్నారు. యరపతినేని శ్రీనివాసరావు ఓటమి పాలైనా ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్నారని.. బాధితులకు అండగా నిలిచారన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. ఆయన ఉన్నప్పుడు శాంతిభద్రతల సమస్యలు రాలేదు. గ్రామాల్లో వర్గాలున్నా.. పారిపోవాల్సినంత రాజకీయం చేయలేదు. కానీ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక గ్రామాల్లో కక్షలు పెరిగాయి. ఇది కూడా ఆయనపై అసంతృప్తికి కారణం అవుతోంది.
గ్రామ రాజకీయాల కారణంగా గత ఎన్నికల్లో గురజాలలో కమ్మ సామజికవర్గం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. సుమారు 50 శాతం మద్దతు కాసు మహేష్‌రెడ్డికి లభించిందని చెబుతారు. ఈ సారి సుమారు 80 శాతం టీడీపీకి అనుకూలంగా ఉన్నట్లేనని .. కుల రాజకీయాలు చేయడంతో కమ్మ సామాజికవర్గంలో ద్వేషం పెంచుకున్నారు. కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన కాసు కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్‌రెడ్డి మొదటి సారి గెలిచారు. నర్సరావుపేట సొంత నియోజకవర్గం కాగా గురజాలను వైఎస్ జగన్ మహేష్‌రెడ్డికి కేటాయించారు. తండ్రి కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ వీడలేదు.
మేలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గురజాల నియోకజవర్గంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య పోటీ జరుగుతోంది. ఈ రెండు సామాజిక వర్గాలే ఓటర్లను నియోకవర్గంలో ప్రభావితం చేయగలుగుతున్నాయి. పోటీ ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది. కాంగ్రెస్ నుంచి విద్యా సంస్థల అధినేత తియ్యగూర యల్లమందారెడ్డి పోటీకి దిగారు. ఆయన కొన్ని ఓట్లను చీల్చే అవకాశం ఉంది. జంగా కృష్ణమూర్తి వర్గం మహేష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పని చేయనుంది.