రీమేక్ కథల్ని ఎంచుకొనేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఉన్నది ఉన్నట్టుగా తీయడం, రెండోది లైన్ మాత్రమే తీసుకొని.. మనదైన మార్పులు చేసుకోవడం. వెంకటేష్‌కి రీమేక్ రాజాగా పేరుంది. ఎందుకంటే ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలే ఎక్కువ. ఆవే బాగా ఆడాయి కూడా. కాబట్టి రీమేక్ విషయంలో వెంకీ గురి ఎప్పుడూ తప్పదన్న భరోసా ఏర్పడింది. ఈసారి ఆయన సాలా ఖదూస్ చిత్రాన్ని రీమేక్ చేశారు.. అది గురుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకురాలిగా సుధా కొంగర, కథానాయికగా రితికా సింగ్ రీమేక్‌లోనూ కంటిన్యూ చేశాడు వెంకీ. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ ప్రామిసింగ్‌గానే కనిపించింది. కథలోకి ముఖ్యమైన సన్నివేశాల్ని గుర్తు చేస్తూ.. ట్రైలర్ కట్ చేశారు. వెంకీ రగ్గడ్ లుక్, మాసీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకొన్నాడు. సంతోష్ నారాయణ్ ఇచ్చిన ఆర్.ఆర్, విజువల్స్ బాగున్నాయి. అయితే.. సాలా ఖదూస్ కథలో పెద్దగా మార్పులు చేయలేదని, కొన్ని షాట్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశారన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది.
కొన్ని కొన్ని కథల్ని.. రీమేక్ పేరుతోమార్చాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాలకు నేటివీటీతో పనిలేదు. ఎక్కడున్నా.. చల్తా. అయితే అందులోని ఎమోషన్స్ క్యారీ చేయగలిగితే చాలు. గురు టీమ్ కూడా అదే చేసినట్టు అర్థమవుతోంది. సాలా ఖదూస్ చూసినవాళ్లు పోలికలు, విమర్శల జోలికి వెళ్తారేమో గానీ, చూడనోళ్లకుమాత్రం కచ్చితంగా గురులో నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కొత్తగా వెంకీ కనిపిస్తున్నాడు. సో… వెంకీ కోసమైనా ఈ సినిమా చూసేయొచ్చు. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.