అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. ఆ తర్వాత… టీడీపీలో చేరారు. ఒక సంవత్సరం కాక ముందే… మళ్లీ వైసీపీలోకి చేరిపోయారు. అనంతపురం నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం ఉన్న నేతల్లో గుర్నాథరెడ్డి ఒకరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రొత్సాహంతో వారు.. అనంతపురంలో బలంగా ఎదిగారు. వైఎస్ మరణం తర్వాత వారు.. జగన్‌తో కలిశారు. జగన్ తో పాటు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయాలు సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ పట్టించుకోవడం లేదంటూ.. కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో జగన్ వేరే వారిని ఇన్చార్జిగా నియమించారు. దాంతో.. జేసీ దివాకర్ రెడ్డి సాయంతో టీడీపీలోకి వచ్చారు.
గుర్నాథ్ రెడ్డి రాకను టీడీపీ నేతలంతా వ్యతిరేకించారు. అయినా ..తనకు వ్యతిరేకంగా ఉంటున్న అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలకు చెక్ పెట్టడానికి జేసీ పట్టుబట్టి.. టీడీపీలో చేర్పించారు. గుర్నాథరెడ్డి టీడీపీలోచేరడానికి ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉందని.. చెబుతున్నారు. అదే మిస్సమ్మ బంగ్లా. వైఎస్ హయాలో.. మిస్సమ్మ బంగ్లా ఆస్తులను గుర్నాథరెడ్డి సోదరులు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు తేలింది. సీఐడీ విచారణలో రూ.200 కోట్ల విలువ చేసే మిస్సమ్మ బంగ్లా కేసులో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఏడుగురిపై 420, 406, 461, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-1 రెడ్డప్పరెడ్డి, ఏ2 గుర్నాథరెడ్డి, ఏ3 ఎర్రి స్వామిరెడ్డి వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, శాంతిమూర్తిసహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.
టీడీపీలో చేరితే.. ఏమైనా ఫేవర్ చేస్తారేమోనని.. గుర్నాథరెడ్డి భావించారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించకపోగా… పార్టీలో కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెబుతున్నారు. గుర్నాథరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిదయిందని.. జేసీ ఒత్తిడికి తొలగ్గి.. ఏదో కార్పొరేషన్ పదవి ఇచ్చినట్లయితే.. మొత్తం అనంతపురం జిల్లా టీడీపీలో చిచ్చు రేగేదని… ఆ పార్టీ నేతలంటున్నారు.