కారెవరూ కౌగిలింతకు అనర్హం అని అధినేత అంటుంటే… కడుపులో కత్తులు పెట్టుకుని కాపురం చేయడం ఎలాగో అర్ధం కాక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఆకర్ష్ యాత్ర… చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత శతృత్వాలే ప్రధానంగా రాజకీయాలు చేసే అనంతపురం లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు మింగ లేని కక్కలేని పరిస్థితి తెస్తోంది.
తాజాగా అనంతపురంకు చెందిన వైసీపీకి కీలక నేత గుర్నాధరెడ్డిని టీడీపీలోకి తీసుకుంటున్న విషయం విదితమే. దీనికి గత కొంత కాలంగా ససేమిరా అంటున్న స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కూడా బుధవారం చంద్రబాబు ఎంతో బుజ్జిగించి, అంగీకరింపజేసిన సంగతీ తెలిసిందే. బుధవారం అయిష్టంగానే తలూపిన ప్రభాకర్ చౌదరి గురువారం మళ్లీ బరస్టయ్యారు. గుర్నాధరెడ్డిపై కారాలూ మిరియాలు రువ్వారు.
గుర్నాధ్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ ఆ చేరిక కార్యక్రమానికి తాను హాజరు కాబోవడం లేదన్నారు. అతనితో కలిసి ఫొటో దిగడానికి కూడా తాను ఇష్టపడేది లేదని, ఎప్పటికీ గుర్నాధ్రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. కబ్జాలు, హత్యలే గుర్నాధరెడ్డి చరిత్ర అంటూ విమర్శించారు ప్రభాకర్ చౌదరి. ఎంతో కాలంగా తాము గుర్నాధరెడ్డితో పోరాడుతున్నామని, ఇప్పుడు ఎవరితో పోరాడాలని ప్రశ్నించారు. కేవలం జెసి కోసమే గుర్నాధరెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారని జిల్లాలో జెసి తప్ప మరెవ్వరూ గుర్నాధ్రెడ్డి రాకను స్వాగతించడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తాను అసెంబ్లీకి గైర్హాజరైందే లేదని, అలాంటిది బుధవారం సగం నుంచే వెళ్లిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షపార్టీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం పార్టీ వలసల మంత్రం… ఆ పార్టీకి ఇప్పటికే పలు ప్రాంతాల్లో తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇదే విధంగా భూమా నాగిరెడ్డి, గొట్టి పాటి రవికుమార్ తదితరులను చేర్చుకునే సమయంలో విపరీతమైన వ్యతిరేకతను అధిగమించాల్సి వచ్చింది. తమది అధికార పార్టీ కాబట్టి… లోలోన ఎంతున్నా ప్రస్తుతానికి అన్నీ లోపలే అణుచుకుని సాగుతున్న ప్రత్యర్ధి వర్గాలు రానున్న ఎన్నికల నాటికి ఒకదానిపై ఒకటి కత్తులు దూస్తే మాత్రం తె.దే.పా ఏదైతే తమ ఆయుధంగా ఎంచుకుందే అదే ఆయుధం ఆ పార్టీకి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.