అనబోతే అక్కకూతురు కొట్టబోతే గర్భవతి అని వెనకటికో సామెత ఉంది! దీని మీనింగ్ చెప్పాలంటే… మింగలేకా కక్కలేకా ఉన్న స్థితి అన్నమాట! ఇంకా దీని గురించి విఫులంగా తెలియాలంటే అనుభపూర్వకంగా తెలుసుకున్న ఫిరాయింపులు నేతలను కూడా సంప్రదించొచ్చు! అధికార పార్టీ చూపిన అరచేతి స్వర్గాల మోజులో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంత పార్టీలను వదిలేశారు. తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ నేతలు అదే పనిచేశారు. అలాంటి ఫిరాయింపు నేతల్లో ముఖ్యంగా చెప్పుకో దగ్గవారు… కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు. రాష్ట్ర మంత్రి పదవి ఆశించి తెరాసలోకి వచ్చారని చాలామంది అంటుంటారు. ప్రస్తుతం తెరాసలో ఉన్న గుత్తాకి ప్రాధాన్యత తగ్గిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కాబట్టి.. గుత్తా కూడా సమావేశాలకు హాజరు కావాలి. అలానే హాజరు అవుతున్నారు. కానీ, సభలోకి వెళ్లలేకపోతున్నారట! సభకు వచ్చినట్టు హాజరు వేయించుకుని, సంతకాలు పెట్టేసి పార్లమెంటు ఆవరణలోనే చక్కర్లు కొడుతున్నారట. సభలో కాంగ్రెస్ తరఫున మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదు కదా! ఇక, తెరాసలో ఆయనకు దక్కుతున్న గౌరవం అంతంత మాత్రంగానే ఉంటోందని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఆయన తెరాసలో చేరిన కొత్తల్లో బాగానే పార్టీలో బాగానే ఉండేదనీ, గుత్తాకి ఎక్కడికి వెళ్లినా చాలా రెస్పెక్ట్ ఉండేదనీ, రానురానూ పరిస్థితి మారిందని అంటున్నారు.
పోనీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి తెరాస తరఫున ఉప ఎన్నికలకు వెళ్దామంటే… ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దంటున్నారట! దీంతో అటు తెరాసలో ఆయన్ని పూర్తిగా ఓన్ చేసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెగించి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో… గుత్తా రెంటికీ చెడుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకంటూ ఒక స్థాయి గుర్తింపు పార్టీ వర్గాల్లో ఉండేది. కానీ, ఇప్పుడు తెరాసలో ఆయన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉన్నారనే వినిపిస్తోంది. ఈ పరిస్థితిపై ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితిలో గుత్తా ఉన్నారట! ఫిరాయింపులు ఇలానే ఉంటాయి.