కేంద్ర ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధర పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి, రైతులకు ఇది కొంత ఊరట కలిగించే అంశమే అయినా… ఆచరణలోనూ రాజకీయపరంగానూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే రైతులు ఎందుకు గుర్తొచ్చినట్టు అంటూ మోడీ సర్కారు వైఖరిని కొన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. రైతులకు ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధరలు కంటి తుడుపు చర్యలుగానే ఉంటున్నాయని విమర్శలు చేస్తున్న పార్టీలో తెలంగాణ అధికార పక్షం కూడా ఉంది. కాకపోతే, ఆ అసంతృప్తిని సీఎం కేసీఆర్ నేరుగా వ్యక్తం చేయడం లేదు! వరి మద్దతు ధరపై ఆయన సూటిగా స్పందించడం లేదు. కానీ, తెరాస నేతల ద్వారా కేంద్ర నిర్ణయంపై స్పందింపజేస్తున్నారని చెప్పాలి!
కేంద్ర ప్రకటించిన వరి మద్దతు ధర గుడ్డిలో మెల్లలా ఉందన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. క్వింటాకి కనీసం రూ. 2000 పెంచుతామని తాము అనుకున్నామనీ, కానీ రూ. 200 మాత్రమే పెంచి కేంద్రం చేతులు దులిపేసుకుందని గుత్తా విమర్శించారు. పత్తి, పప్పు ధాన్యాల మద్దతు ధరల విషయంలో కొంత ఫర్వాలేదన్నారు. వరి విషయంలో కేంద్రం చేసిన ప్రకటన రైతులకు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించేదే అన్నారు. ఇది ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందన్నారు. గతంలో ఎప్పుడు వరికి మద్దతు ధర పెంచినా గ్రేడ్ ఎ, గ్రేడ్ బిలకు సమానంగా పెంచేవారనీ.. ఇప్పుడు పెంచిన ఈ రెండు వందల రూపాయలు గ్రేడ్ బికి మాత్రమేనన్నారు. గ్రేడ్ వన్ కి 180 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. మద్దతు ధర విషయంలో సీఎం కేసీఆర్ కూడా ఓ మూడుసార్లు ప్రధానమంత్రికి చెప్పారనీ, రూ. 2000 చేయాలని కోరారని గుత్తా గుర్తు చేశారు. పార్లమెంటులో కూడా తమ పార్టీ ఎంపీలంతా కూడా కలిసి అడిగామన్నారు. కానీ, తాజా నిర్ణయంతో కేంద్రం తీవ్ర నిరాశే మిగిల్చిందన్నారు.
రైతుల కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక అజెండా రూపొందిస్తామంటూ ఫెడరల్ ఫ్రెంట్ స్థాపన నేపథ్యంలో కేసీఆర్ చెబుతూ వచ్చారు. రైతులు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారనీ, వ్యవసాయం నిర్లక్ష్యానికి గురౌతోందంటూ పదేపదే విమర్శలు చేస్తారు! కానీ, మద్దతు ధరల విషయంలో కేంద్రం ఇంత కీలకమైన నిర్ణయం తీసుకుంటే… దానిపై తెరాసలో కూడా అసంతృప్తి ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా స్పందించాలి. అంతేగానీ, గుత్తాతో ఆ అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఈ నిర్ణయంపై కేసీఆర్ స్వయంగా విమర్శలు చేస్తే… అది భాజపాకి మరోలా వినిపిస్తుందనే అభిప్రాయం ఆయనకి ఉందో ఏమో మరి..! వరి మద్దతు ధర విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెరాస విమర్శలు చేసింది.. కేసీఆర్ మాత్రం కాదు, అంతేనా.