పార్టీలు మారే నేతలు రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవడానికో లేకపోతే తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసమో లేకపోతే తమ అనుచరుల ఒత్తిడి మేరకో పార్టీ మారుతున్నామని చెప్పుకొంటుంటారు కానీ, పార్టీలో అంతర్గత కలహాల కారణంగా పార్టీ మారుతున్నామని చెప్పుకొనే వాళ్ళు కనబడరు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం తను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ముఠాల మద్య జరుగుతున్న గొడవలు భరించలేకనే తెరాసలో చేరానని చెప్పుకొన్నారు. వారి మద్య గొడవలు ఎవరూ కూడా భరించలేని స్థాయికి చేరుకోన్నాయని అందుకే పార్టీ వీదానని చెప్పుకొన్నారు. పార్టీలో తనకి గౌరవం లేదని, ఎవరిని కలిసినా అనుమానంగా చూస్తున్నారని, అది భరించడం కష్టంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాలను స్వంత సామ్రాజ్యాలుగా భావిస్తూ వాటిలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనపై విమర్శలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు చేశారు. డిల్లీలో పైరవీలు చేసుకొని టికెట్ తెచ్చుకొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి తనపై విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఎవరినీ విడిచిపెట్టబోనని టీ-కాంగ్రెస్ నేతలని గుత్తా హెచ్చరించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డితో సహా చాలా మంది కాంగ్రెస్, తెదేపా నేతలు, ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్ ని, తమ వ్యాపారాలను, కాంట్రాక్టులని కాపాడుకోవడానికే తెరాసలో చేరుతున్నారని ఆ పార్టీల నేతలే ఆరోపిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు, అధికారం, డబ్బు, ప్రజలలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు అన్నీ సంపాదించుకొన్న నేతలు, పార్టీ ఓడిపోగానే విడిచిపెట్టి వెళ్లిపోవడం ద్రోహమేనని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అది నిజమే అయినప్పటికీ, రాజకీయాలలో, పార్టీలలో, వాటి నేతలలో విలువలు దిగజారిపోయినప్పుడు, ఇటువంటి పరిణామాలన్నీ కూడా జీర్ణించుకోక తప్పదు. ఒకప్పుడు ఎన్నికలకి ముందే ఇటువంటి వలసలు ఎక్కువగా కనబడేవి. టికెట్స్ ఆశించి భంగపడినవారు పార్టీపై అసంతృప్తితో వేరే పార్తీలలోకి మరేవారు. కానీ ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. ఫిరాయిమ్పులని నిరోధించేందుకు బలమైన చట్టాలు ఏర్పాటు చేసుకొంటే తప్ప ఈ అప్రజాస్వామిక ప్రక్రియకి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు.